సామాజిక‌, రాజ‌కీయ, ఆర్థిక రంగాల్లో ద‌ళిత బ‌హుజ‌నుల ఉన్న‌తే ల‌క్ష్యంగా ఏర్ప‌డిన బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ తొలి ద‌శ‌లో సాధించిన విజ‌యాలు ఘ‌న‌మైన‌వే. బ‌హుజ‌నులంటేనే జ‌నాభాలో అత్య‌ధిక శాతం అని అర్థం. వారి అండ‌తో ఎదిగిన ఆ పార్టీ అధినేత్రి మాయావ‌తి దేశంలోనే అతిపెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఏకంగా నాలుగు ప‌ర్యాయాలు ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. అంతేకాదు దేశంలో ద‌ళిత వ‌ర్గం నుంచి ఆ ప‌ద‌విని అందుకున్న తొలి మ‌హిళ‌గా ఆమె ఘ‌న‌త‌ను సాధించారు. అప్ప‌ట్లో మాయావ‌తి అనుస‌రించిన దూకుడు వైఖ‌రి చూశాక జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల‌కు ప్ర‌త్యామ్నాయంగా దేశ‌వ్యాప్తంగా విస్త‌రించ‌డానికి బీఎస్పీకి ఎంతోకాలం ప‌ట్ట‌క‌పోవ‌చ్చ‌ని అంద‌రూ భావించారు. ఒక ద‌శ‌లో మాయావ‌తి ప్ర‌ధాని అభ్య‌ర్థిత్వానికి పోటీ ప‌డుతున్న‌ట్టు ప్ర‌చారం కూడా సాగింది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు కూడా ఇలాంటి విశ్లేష‌ణ‌లే రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపించాయి. అయితే ప్ర‌స్తుతం సొంత రాష్ట్ర‌మైన యూపీలోనే బ‌లం త‌గ్గిపోవ‌డంతో బీఎస్పీ ఇత‌ర రాష్ట్రాల సంగ‌తి వ‌దిలేసి సొంత రాష్ట్రంలో త‌న బ‌లం నిలుపుకునేందుకు పోరాడాల్సిన ప‌రిస్థితిలో ప‌డింది.
 
1984లో ద‌ళిత నేత కాన్షీరామ్ ఈ పార్టీని స్థాపించారు. స‌మాజంలో 85 శాతంగా ఉన్న‌ద‌ళిత‌, బ‌హుజ‌న‌, మైనారిటీ వ‌ర్గాలు..దాదాపు ఆరువేల‌కు పైగా కులాలు ఉప‌కులాలుగా విడిపోయి ఉన్నార‌ని, వీరంద‌రినీ సంఘ‌టితం చేసి అధికారం వైపు న‌డిపించ‌డ‌మే బీఎస్పీ ల‌క్ష్య‌మ‌ని కాన్షీరాం చెప్పుకున్నారు. గౌత‌మ బుద్ధుడి బోధ‌న‌ల‌తోపాటు, డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్‌, మ‌హాత్మా జ్యోతిబా పూలే, నారాయ‌ణ‌గురు, పెరియార్ రామ‌స్వామి నాయ‌క‌ర్‌, ఛ‌త్ర‌ప‌తి సాహుజీ మ‌హ‌రాజ్‌ల సామాజికోద్ద‌ర‌ణ విధానాల స్ఫూర్తితో కాన్షీరాం త‌న పార్టీ ఐడియాల‌జీని రూపొందించారు. ఆ పార్టీ సింబల్ ఏనుగు కూడా అంబేద్క‌ర్ ఉప‌యోగించిందే కావ‌డం విశేషం. 1993లో కాన్షీరాం ఆరోగ్యం క్షీణించ‌డంతో ఆయ‌న శిష్యురాలు మాయావ‌తి చేతికి పార్టీ ప‌గ్గాలు వ‌చ్చాయి. 1995లో స‌మాజ్‌వాది పార్టీతో సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం ద్వారా మాయావ‌తి తొలిసారి ముఖ్య‌మంత్రి అయ్యారు. ఆ తరువాత ఆ పార్టీతో పొత్తు విచ్ఛిన్నం కావ‌డంతో 1997లో బీజేపీ మ‌ద్ద‌తుతో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2002లో మూడోసారి ముఖ్య‌మంత్రి అయినా బీజేపీతో విభేదాల కార‌ణంగా ఏడాదికే ప్ర‌భుత్వం కూలిపోయింది.


2007 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సొంతంగానే ఏకంగా యూపీలో 206  సీట్ల‌ను గెలుచుకుని బీఎస్పీ చ‌రిత్ర సృష్టించింది. ఆ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ భావ‌జాలానికి భిన్నంగా అగ్ర‌కులాలకు చెందినవారికి కూడా వ్యూహాత్మ‌కంగా ఎక్కువ సంఖ్య‌లో పార్టీ టికెట్లు కేటాయించడం ద్వారా మాయావ‌తి సొంతంగానే నాలుగోసారి ముఖ్య‌మంత్రి కాగ‌లిగారు. అయితే ఈ కాలంలోనే ఆమె ప్ర‌భుత్వంపై అవినీతి ఆరోప‌ణ‌లు స‌హా ప‌లు విమ‌ర్శ‌లు రావ‌డంతో 2012లో స‌మాజ్‌వాదీ పార్టీ చేతిలో పరాజ‌యం ఎదుర్కోవాల్సి వ‌చ్చింది, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఆ పార్టీ 19.3 శాతం ఓట్లు సాధించి రెండో పెద్ద పార్టీగా నిలిచింది. 10 ఎంపీ స్థానాల‌నూ గెలుచుకుంది. అయితే 2017 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సాధించిన 22 శాతంతో పోలిస్తే ఇది త‌క్కువే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో యూపీలో మ‌యావ‌తి బ‌లం త‌గ్గుతోందా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి త‌గిన‌ట్టుగానే ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళుతున్న నాయ‌కులు స‌మాజ్‌వాది పార్టీలో చేర‌డం, వారిలో బ‌ల‌మైన నాయ‌కులుగా గుర్తింపు ఉన్న‌వారు మొద‌ట్లో బీఎస్పీలోనే ఎదిగిన‌వారు కూడా కావ‌డం దీనినే సూచిస్తోంద‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. మొత్తంమీద కాంగ్రెస్‌ను కోలుకోనీయ‌కుండా చేసేందుకు మొద‌ట్లో మాయావ‌తికి మ‌ద్ద‌తుగా నిలిచిన బీజేపీ వ్యూహం కూడా మాయావ‌తికి కొన్ని వ‌ర్గాల‌ను దూరం చేసింద‌ని చెప్పాలి. తాజాగా జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో బీఎస్పీ సాధించే ఫ‌లితాల‌ను బ‌ట్టి ఆ పార్టీ భ‌విష్య‌త్తు ఏంటో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: