గత ఏడాదిలో వివిధ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ 20 నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ గడువు దాదాపు అన్నిటిలోనూ పూర్తయ్యింది. ఈ ఏడాదిలో వీటికి పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. 25 వేలకు మించి దరఖాస్తులు వచ్చిన అన్ని పోస్టులకూ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. అందులో అర్హత సాధించిన వారికి తదుపరి మెయిన్స్ పరీక్ష పెడతారు. ఇప్పటివరకు జారీ చేసిన నోటిఫికేషన్లలో గ్రూప్2కి అత్యధిక దరఖాస్తులు అందాయి. మొత్తం 982 పోస్టులకు గాను 6,57,010 మంది దరఖాస్తు చేశారు.
అంటే ఒక్కో పోస్టుకు 670 మంది పోటీ పడుతున్నట్లు లెక్క. ఈ పోస్టులకు ఈనెల 26న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి పేర్కొన్నారు. మెయిన్స్ పరీక్షను మే 20న నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ ఒఎమ్మార్ పత్రాలతో పేపర్ ప్రశ్నపత్రాలతో నిర్వహించనుండగా మెయిన్స్ పరీక్షను కంప్యూటరాధారితంగా చేపట్టనున్నారు. ఈ దరఖాస్తుల్లో అత్యధికం విశాఖపట్నం జిల్లా నుంచి రాగా, విజయనగరం జిల్లా నుంచి అత్యల్పం అందాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలోనే దరఖాస్తులు అందడం విశేషం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి