కొంపెల్ల జనార్ధనరావు సాహితీ అభిమానుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. శ్రీశ్రీకి అత్యంత స‌న్నిహితుడిగా, స్నేహితుడిగా ప్ర‌పంచానికి ప‌రిచ‌యం. స్వ‌త‌హాగా భావ‌క‌విగా గుర్తింపు తెచ్చుకున్నారు.  అలాగే నాట‌క ర‌చ‌యిత‌గాను రాణించారు. కొంపెల్ల జనార్దనరావు 1906 ఏప్రిల్‌ 15న తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలం, మోడేకుర్రులో జన్మించారు. కొంపెల్ల జనార్ధనరావు సంప్రదాయవాది. ప్రవర్తనలో పరమ సనాతనుడు. సాహిత్యంపై  అత్యంత ప్రేమ కలిగిన వ్యక్తి. తన అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా సాహిత్యసేవ చేశాడు. నడివయస్సు కూడా రాకుండానే క్ష‌య వ్యాధితో జూన్ 23, 1937లో ప‌ర‌మ‌ప‌దించారు.

 

1928లో శ్రీశ్రీ రచించిన ప్రభవను కొంపెల్ల సమీక్షిస్తూ తీవ్రంగా వ్యతిరేక విమర్శలు చేశారు. విచిత్రంగా ఆ విమర్శల వల్లనే కలిసి వీరిద్దరు మంచి మిత్రులయ్యారు. అప్పటి నుంచి 1937లో కొంపెల్ల మరణించేవరకూ వారిద్దరి స్నేహం కొనసాగింది. శ్రీశ్రీ త‌న మహాప్రస్థానాన్ని అంకితమిస్తూ  కొంపెల్ల జనార్ధనరావును ఉద్దేశిస్తూ కొంపెల్ల జ‌నార్ధ‌న‌రావు అనే కవిత రాశారు. విశాఖపట్నం లోని 'కవితా సమితి' ద్వారా పురిపండా అప్పలస్వామి సాహచర్యంతో మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రేరణతో భారతి పత్రికలో చేరాడు. భారతి, ఆంధ్రపత్రిక, సుభాషిణి మొదలైన పత్రికలలో దాదాపు 25 కవితా ఖండికలను భావ కవితారీతిలో ప్రచురించారు. 

 

1934 డిసెంబరులో ఉదయిని అనే ద్వైమాసిక సాహిత్య పత్రికను వెలువరించడం ప్రారంభించాడు. ఇతడు 'తాన్ సేన్', 'తెలుగు' అనే నాటికలు రచించాడు. ఉదయిని అనే సాహితీ పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఉదయిని సాహిత్య పత్రికను ఆయన ఆరు సంచికల కన్నా వెలువరించలేకపోయారు. సాహిత్యానికి ప్రజాభిమానం సంపాదించాలన్న గొప్ప ఆశయంతో అహర్నిశలు పనిచేసి పత్రికను కొనమని వాడవాడలా బిచ్చమెత్తారు. అప్పటి కొత్త కవులు నవ్యసాహిత్యపరిషత్ తరఫున స్థాపించుకున్న ప్రతిభ అనే సాహిత్య పత్రిక సాహిత్యపరుల అభిమానం చూరగొనడంతో ఉదయిని పత్రిక మరింత దెబ్బతింది. ఈ క్రమంలో ఆయన చేసిన శారీరిక, మానసిక శ్రమ వల్ల అనారోగ్యం బాగా క్షీణించింది.

 

ముద్రణ ఖర్చులు కొంపెల్ల ఇవ్వలేకపోవడంతో ఉదయిని ఏడో సంచికను చిత్తుకాగితాలుగా అమ్మేశారు.  ఈ సంఘ‌ట‌న‌తో ఆయ‌న మాన‌సికంగా చాలా కుంగిపోయారు. దానికి తోడు అనారోగ్యం తీవ్రమై క్షయ వ్యాధితో దుర్భర దారిద్ర్యంలో దీనస్థితిలో కొంపెల్ల మరణించారు. శ్రీశ్రీకి, కొంపెల్లకు ఏ రకమైన భావసారూప్యత లేకున్నా వారి మధ్య స్నేహం మాత్రం చాలా చక్కగా కలిసిపోవడం విశేషం. పైగా మహాప్రస్థాన కావ్యానికి ఏమాత్రం సంబంధం లేని భావాలు కలిగిన కొంపెల్లకు అతని మరణం, అందులోనూ సాహిత్య పత్రికలు వర్థిల్లాలన్న మహదాశయంతో మరణించడం వంటివి శ్రీశ్రీని కదిలించాయి. కొంపెల్ల ఉదయిని దెబ్బతినడానికి కారణమైన ప్రతిభ పత్రిక సంపాదకవర్గంలో ఒకరైన శ్రీశ్రీ పరోక్షంగా తన వల్ల జరిగినదానికి బాధ కూడా కలిసి మహాప్రస్థానం కొంపెల్లకు అంకితం చేయించివుంటుందని శ్రీశ్రీ చరిత్రకారుడు బూదరాజు రాధాకృష్ణ అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: