ఇప్పుడు సోషల్ మీడియాలో పాత సినిమా కొత్తగా ట్రెండ్ అవుతుంది. దానిపై వస్తున్న మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. ఆ సినిమా పారసిటమాల్ అయితే అందులో హీరో డోలో 650. ఈ మధ్య సోషల్ మీడియా లోనే కాదు మీడియాలోనూ డోలో 650 తెగ సందడి చేస్తోంది. కరోనా థర్డ్ వేవ్, ఓమిక్రాన్ వేరియంట్ల నేపథ్యంలో డోలో 650 మీద మీమ్స్ పెరిగిపోయాయి. ఆ కంపెనీకి బాగా లాభాలు కూడా తెచ్చిపెట్టాయి. అసలు ఈ క్రేజ్ ను తాము కూడా ఊహించలేదంటోంది కంపెనీ. డోలో 650 అనేది పారాసెటమాల్ అనే విషయం తెలిసిందే. కాకపోతే అందులో ఉండే మెడిసిన్ పవర్ 650 mg ఉంటుంది. డోలో అనేది మెడిసిన్ పేరు కాదు, అదొక బ్రాండ్ పేరు. అందులో ఉండే మెడిసిన్ పారాసెటమాల్, మైక్రో ల్యాబ్స్ అనే ఫార్మా కంపెనీ దీన్ని తయారు చేస్తుంది. 1993 లో డోలో 650 పారాసెటామాల్ 500mg విభాగంలో బాగా పోటీ ఉండటంతో కొత్తగా ఏమైనా చేయాలని భావించింది కంపెనీ.

 ఇందుకు మార్కెట్ ను స్టడీ చేయడంతో పాటు అనేకమంది డాక్టర్లతో మాట్లాడమని మైక్రో ల్యాబ్స్ ఎండి అన్నారు. జ్వరం, నొప్పిని తగ్గించడంలో పారాసెటామాల్ 500mg ఎఫెక్టివ్ గా పనిచేయడం లేదని గుర్తించింది మైక్రోలాబ్స్. దీనికి సమాధానంగా డోస్ పెంచి పారాసెటమాల్ 650mg ని తయారు చేయడం మొదలు పెట్టింది.దానికి పెట్టిన బ్రాండ్ నేమ్ డోలో 650. టాబ్లెట్ పవర్ 500 నుంచి 650mg కి పెరిగింది కాబట్టి దాని సైజు కూడా పెరుగుతుంది. అందువల్ల మింగేటప్పుడు  సమస్యలు తలెత్తకుండా ఉండడానికి కోడిగుడ్డు ఆకారంలో తయారు చేయడం ప్రారంభించారు.30ఏళ్ల నుంచి మార్కెట్లో ఉన్న డోలో 650 ఇప్పుడు ఇంత పాపులర్ కావడానికి కారణం కరోనా క్రైసెస్. కరోనా కాలంలో వినియోగం పెరగడంతో గత రెండేళ్లలో దీని సేల్స్ భారీగా పెరిగాయి. హెల్త్ కేర్ రీసెర్చ్ సంస్థ IQVR రిపోర్టు ప్రకారం మార్చి 2020 తర్వాత 350 కోట్ల డోలో650 పిల్స్ అమ్ముడుపోయాయి. 2021లో డోలో అమ్మకాల విలువ       రూ.307 కోట్లకు పెరిగింది. 2019లో కరోనా రాకముందు అమ్ముడుపోయిన డోలో పిల్స్ 110 కోట్లు మాత్రమే. ఇదే కాదు జి ఎస్ కే ఫార్మా కు చెందిన పారాసెటమాల్ బ్రాండ్ కాల్పాల్  కూడా రూ.310 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. కరోనా క్రైసెస్ లో పారాసెటమాల్ ఎంతగా వాడమో ఈ గణాంకాలను చూస్తేనే తెలుస్తుంది. కరోనా సోకిన పేషెంట్ లలో జ్వరం, ఒళ్లు నొప్పులు కామన్ గా కనిపించే లక్షణాలు.

దాంతో కరోనా సమయంలో డాక్టర్లు ఎక్కువగా పేషెంట్లకు డోలోను ప్రిస్క్రైబ్ చేశారని  నిపుణులు అంటున్నారు. ఇక పేషెంట్లలో మౌత్ పబ్లిసిటీ పెరగడం వల్ల డోలో 650 కి కలిసి వచ్చిందని వారు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అయిన టాబ్లెట్లలో డోలో 650 ముందంజలో ఉంది. వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర ఆరోగ్య నిపుణులకు డోలో 650 తో పాటు శానిటైజర్ లు, మాస్కులు ఉండే కిట్స్ ను ఇవ్వడం, మెడికల్ షాపుల్లో సరిపడా స్టాక్ ఉండేలా చూడటం వంటి చర్యలు తీసుకున్నామని కంపెనీ చెబుతోంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత జ్వరం,నొప్పి వస్తే వేసుకోవడానికి డాక్టర్లు డోలోనే ప్రిస్క్రైబ్ చేశారని వారంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: