ఇప్పుడు ఎక్కడ చూసినా గుండెపోటుతో మరణించే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 60-70 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో మరణించిన వారిని ఒక విధంగా అంగీకరించవచ్చు. కానీ 35, 39, 45 సంవత్సరాల లోపు వయస్సు గలవారిలో గుండెపోటుతో మరణాలు పెరుగుతున్నాయి. ఇటీవల తమిళనాడుకు చెందిన కార్డియాక్ సర్జన్ డాక్టర్ గ్రాట్లీన్ రాయ్ (39) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కార్డియాక్ సర్జన్‌గా పనిచేస్తున్న ఆయన, బుధవారం విధుల్లో భాగంగా ఆసుపత్రి వార్డులో రౌండ్స్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. తోటి వైద్యులు ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయారు. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.

గుండె సంబంధిత జాగ్రత్తలు బాగా తెలిసిన కార్డియాక్ సర్జన్ అయిన గ్రాట్లీన్ రాయ్ 39 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మృతి చెందడం సంచలనంగా మారింది. ఆయనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని సమాచారం. డాక్టర్లు చెబుతున్నదేమిటంటే యువతలో హఠాత్తుగా సంభవిస్తున్న గుండెపోటుకు ప్రధాన కారణాలు పని ఒత్తిడి, దీర్ఘకాలిక పని గంటలు అని. ప్రతి వ్యక్తికి ఒక పని సమయం ఉండాలి. ఆ పరిమితి మించి శరీరాన్ని అలసటకు గురి చేస్తే, మెదడు మరియు శరీరం తట్టుకోలేవు. పని ఒత్తిడి సాధారణ స్థాయిలోనే ఉండాలి. ఆ స్థాయిని మించితే ఏ వయసు వారైనా ఆరోగ్య సమస్యలకు గురవుతారు.

వైద్యులు తరచుగా రోజుకు 18 గంటలపాటు పని చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు 24 గంటలపాటు డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఈ కారణంగా వారిపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో కఠినమైన కేసులు ఎదురైనప్పుడు ఒత్తిడి మరింత రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో గుండెపోటులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో అనారోగ్యకర జీవనశైలి, వ్యాయామం లేకపోవడం వంటి అంశాలు కూడా గుండెపోటుకు కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 39 ఏళ్ల వయసులో ఒక కార్డియాక్ సర్జన్ గుండెపోటుతో మృతి చెందడం నిజంగా సంచలనమే. దీని వెనుక ప్రధాన కారణాలు పని ఒత్తిడి, అధిక ఓవర్‌టైమ్ డ్యూటీలు, తగిన విశ్రాంతి లేకపోవడం అని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సంఘటన ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక. పని ఒత్తిడి ఎప్పుడూ పరిమితిలో ఉండాలి. శరీరం, మనసు సహించేంతవరకే పని చేయాలి. పరిమితిని మించే పని మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ప్రతి రంగంలోనూ ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రశాంతమైన జీవనశైలిని అవలంబించడం చాలా అవసరం అని వైద్యులు సూచిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: