రామాపురం అనే ఊళ్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారి తండ్రి చనిపోతూ వాళ్లిద్దరికి ఒక మామిడిచెట్టు, ఒక ఆవు, ఒక కంబళి ఇచ్చి వాటిని ఇద్దరూ సమానంగా అనుభవించమని చెప్పి చనిపోయాడు. ఆ ఇద్దరిలో తమ్ముడు అమాయకుడు. అన్నేమో గడుసువాడు. అన్న తమ్ముడితో ‘‘నాన్న మనకు ఒకే చెట్టు, ఒకే ఆవు, ఒకే కంబళి ఇచ్చాడు గదా!వాటిని ముక్కలు చెయ్యగూడదు. కనుక వాటిని కలిసి ఉపయోగించుకుందాం. చెట్టు మొదల భాగం నీకు, పై కొమ్మల భాగం నాకు ఇచ్చేయ్’’ అన్నాడు.  అందులోని కపటం తెలియక సరేనన్నాడు తమ్ముడు. రోజూ తమ్ముడు చెట్టు మొదట కుదుళ్లలో నీళ్లు పోసేవాడు, ఆవుకు మేత, కుడితి పెట్టేవాడు, చెట్టు కొమ్మలకు కాసిన కాయలు, పండ్లు అన్న తీసుకొనేవాడు. ఆవుపాలు కూడా తానే పితుకుకొనేవాడు. కంబళి మాటకు వస్తే పగలు దాని అవసరం ఉండదు. కనుక తమ్మడు దానిని ఎండలో వేసి దులిపి మడతపెట్టేవాడు. అన్న చక్కగా రాత్రిపూట దానిని కప్పుకొనేవాడు. ఇట్టా కొంతకాలం గడిచిన తరువాత తమ్ముడికి పెళ్లి అయింది. అతని భార్య అమాయకుడైన తన భర్తను ఎట్టామోసం చేస్తున్నాడో గమనించింది. భర్తతో ఒక మాట చెప్పి ఆవిధంగా చెయ్యమన్నది. భార్య మాట ప్రకారం తమ్ముడు ఒక గొడ్డలి తెచ్చి దానితో చెట్టు మొదలునరకబోయాడు. అన్న కంగారుపడి అడ్డు వచ్చి ‘ఇదేం పని!’ అని మందలించాడు. ‘‘ఈ చెట్టు మొదలు నాది కధా! నా యిష్టం! అన్నాడు తమ్ముడు.’’ ‘‘మొదలు నరికితే చెట్టు మొత్తం చచ్చిపోతుంది. అలా చేయకు. ఇక నుంచి కాసే పండ్లు చెరిసగం తీసుకుందాం’’ అన్నాడు అన్న.  అన్నపాలు పితికే వేళకు తమ్ముడు ఆవుకు మేత వేయ్యకపోగా ఒక కర్ర తీసుకొని ఆవు ముట్టె మీద కొట్టసాగాడు. పాలివ్వకుండా ఆవు అన్నని తన్నింది.‘‘ అదేమిటి?’’ అని అన్న అడిగితే, ‘ఆవు ముందుభాగం నాది కధా! నా యిష్టం’’ అని బదులు చెప్పాడు తమ్ముడు. అన్న అప్పుడు ‘‘ ఇక మీదట ఇద్దరమూ ఆవును మేపుదాం, పాలు కూడా సమానంగా పంచుకుందాం’’ అన్నాడు.  ఆ మరునాడు తమ్ముడు కంబళిని పగటిపూట నీటిలో తడిపి, ఆ తడి కంబళిని సాయంత్రం అన్నకు ఇచ్చాడు. అన్న దానిని ఉపయోగించుకోలేక పోయాడు. దానితో అన్నకు బుద్ది వచ్చి ‘తన తప్పు క్షెమించమని’ తమ్ముడిని బతిమిలాడాడు. ఆ తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ సమానంగా అనుభవిస్తూ హాయిగా సుఖంగా జీవించారు.  ఈ కథలోని నీతి :అమాయకులను ఏనాడూ మోసం చేయకూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: