ఆదివారం వస్తే చాలు నాన్వెజ్ కంపల్సరీ.ఇందులో మటన్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ల  కోసం కొత్త రెసిపీ తీసుకోచ్చాము.మటన్ ని ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి ఎంత సింపుల్ గా చేసినా కూడా టేస్ట్ అదిరిపోతుంది.మటన్ ఫ్రై లేదా టమాటో మటన్ కర్రీ,గోంగూర మటన్ కర్రీ,బోటీ కర్రీ, తలకాయ కూర, ఇలా అనేక రకాలుగా చేసుకుని తింటారు. మటన్ తో చేసిన కూరనే ఇంత బాగుంటే మరి మటన్ లివర్ కర్రీ ఇంకెంత టేస్టీ గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది.అంత అద్భుతం గా ఉంటుంది. సింపుల్ గా క్షణాల్లో ఈ మటన్ లివర్ కర్రీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. 


ముందుగా హాఫ్ కేజీ మటన్ లివర్ ని శుభ్రగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు నాలుగు పెద్ద సైజ్ ఉల్లిపాయలు తీసుకొని వాటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో నుండి సగం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయ ముక్కలలో ఇంకాస్త ఆయిల్ ఆడ్ చేసి కొంచం పసుపు, నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి ముక్కలు, ఒక స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి బాగా పచ్చి వాసన పోయేవరకు మగ్గనివ్వాలి.


ఇక అందులో కట్ చేసి పెట్టుకున్న మటన్ లివర్ ముక్కలని వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలుతున్నపుడు రెండు చెంచాలా కారం, రుచికి సరిపడా ఉప్పు,చెంచా ధనియాల పొడి, చెంచా మిరియాలపొడి వేసి బాగా కలపాలి.తర్వాత ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని పేస్ట్ లా చేసి లివర్ ముక్కలలో వేయాలి. మూత పెట్టి ఒక ఐదు నిముషాలు సన్నని మంటపై మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి పైన కొంచం పుదీనా కొంచం కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోండి.ఎంతో రుచిగా ఉండే మటన్ లివర్ కర్రీ రెడీ. అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉండండి.పెరిగే పిల్లలకి చాలా మంచిది.బాలింతలకు కూడా మంచిది పాలు బాగా పడతాయి.ఇలా చేసుకొని తినటం వల్ల మీకు కొత్తగా ఉంటుంది.రుచి కూడా అదిరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: