మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్ ముస్తాఫా సులేమాన్ చేసిన తాజా వ్యాఖ్యలు టెక్ ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. రాబోయే 12 నెలల్లోనే మేధోశ్రామికులు చేసే 'వైట్ కాలర్' ఉద్యోగాలు చాలా వరకు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా కంప్యూటర్ ముందు కూర్చుని చేసే ప్రతి ఉద్యోగం ఇప్పుడు రిస్క్‌లో ఉందని ఆయన స్పష్టం చేశారు.
వ్యాపార సంస్థల కోసం మైక్రోసాఫ్ట్ సిద్ధం చేసిన 'ప్రొఫెషనల్ గ్రేడ్ ఏజీఐ' (Professional Grade-AGI) మోడల్ గురించి వివరిస్తూ సులేమాన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము రూపొందించిన ఈ ఏఐ మోడల్‌తో నిపుణులు చేయగలిగిన దాదాపు అన్ని పనులనూ చేయించవచ్చని ఆయన తెలిపారు. లాయర్లు, అకౌంటెంట్లు, ప్రాజెక్టు మేనేజర్లు, మార్కెటర్లు వంటి వారు చేసే రొటీన్ పనులను రాబోయే 12 నుంచి 18 నెలల్లో ఏఐ ఆటోమేటిక్‌గా చేస్తుందని ఆయన అంచనా వేశారు.
రాబోయే రోజుల్లో పని విధానం భారీ మార్పులకు లోనవుతుందని, ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందే కొద్దీ వివిధ సంస్థల అవసరాలకు తగినట్టుగా ప్రత్యేక ఏఐ మోడల్స్‌ను సిద్ధం చేయడం మరింత సులభం అవుతుందని సులేమాన్ పేర్కొన్నారు. రాబోయే రెండు, మూడేళ్లలో భారీ సంస్థల్లో కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా ఏఐ అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.
ఇప్పటికే ఆంథ్రోపిక్ వంటి సంస్థలు ప్రవేశపెట్టిన ఏఐ ఉత్పత్తులు కోడింగ్ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీనివల్ల స్టాక్ మార్కెట్లు కుదుపునకు లోనవడమే కాకుండా, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజాల షేర్లు కూడా నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. మొత్తానికి ఏఐ విప్లవం వైట్ కాలర్ ఉద్యోగాల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకొనేలా చేస్తోందని సులేమాన్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి