వంకాయను కూరగాయల్లో రారాజు అని పిలుస్తారు. దీని రుచి, చేసే రకరకాల వంటకాలు చాలామందికి ఎంతో ఇష్టం. అయితే అమృతం కూడా అతిగా తీసుకుంటే విషమవుతుందన్నట్లుగా, వంకాయను పరిమితికి మించి తింటే కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వంకాయలో 'సోలనిన్' అనే మూలకం ఉంటుంది. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపు ఉబ్బరంతో బాధపడేవారు వంకాయను ఎక్కువగా తింటే ఆ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. కొందరిలో ఇది వాంతులు లేదా విరేచనాలకు కూడా దారితీయవచ్చు.

వంకాయ వల్ల కలిగే మరో ప్రధాన ఇబ్బంది అలర్జీ. వంకాయ తిన్న తర్వాత కొందరిలో చర్మంపై దద్దుర్లు రావడం, దురద పుట్టడం లేదా గొంతులో గరగర వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి కారణం అందులో ఉండే హిస్టమైన్ అనే రసాయనం. శరీరంలో అలర్జీ తత్వం ఉన్నవారు వంకాయ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కూడా వంకాయను తక్కువగా తీసుకోవడం శ్రేయస్కరం. ఇందులో ఉండే ఆక్సలేట్లు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి లేదా ఉన్న రాళ్ల పరిమాణం పెరగడానికి కారణమవుతాయి.

రక్తహీనతతో బాధపడుతూ ఐరన్ టాబ్లెట్లు వాడేవారు కూడా వంకాయను అతిగా తినకూడదు. ఇందులోని నాసునిన్ అనే మూలకం శరీరం ఐరన్‌ను గ్రహించే శక్తిని తగ్గిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వంకాయలో ఉండే టైరామైన్ అనే అమినో యాసిడ్ రక్తపోటును పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి బీపీ సమస్య ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవాలి. గర్భవతులు కూడా వంకాయను అధికంగా తీసుకోకపోవడమే మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. ఏదైనా సరే పరిమితిలో తీసుకున్నంత కాలం రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది, కానీ అతిగా వాడితే మాత్రం ఇన్ని ఇబ్బందులు తప్పవు. కాబట్టి రుచికి బానిసవ్వకుండా ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహారంలో మార్పులు చేసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: