వేసవి కాలం వచ్చిందంటే చాలు పగటిపూట ఉక్కపోత, రాత్రిపూట ఉక్కపోతతో నిద్ర కరువవుతుంది. బయట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి, గాఢ నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. అయితే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ మండుటెండల్లో కూడా హాయిగా నిద్రపోవచ్చు. ముందుగా మీరు పడుకునే గదిని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పగటిపూట గది కిటికీలకు మందపాటి తెరలు వేయడం ద్వారా బయటి వేడి లోపలికి రాకుండా చూడవచ్చు. సాయంత్రం వేళ గాలి ఆడేలా కిటికీలు తెరిచి ఉంచాలి. పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది త్వరగా నిద్ర పట్టేలా చేస్తుంది.
మనం ధరించే దుస్తులు కూడా నిద్రపై ప్రభావం చూపుతాయి. వేసవిలో సాధ్యమైనంత వరకు వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. సింథటిక్ లేదా పాలిస్టర్ బట్టలు చెమటను పీల్చుకోవు సగదా, శరీరాన్ని మరింత వేడెక్కేలా చేస్తాయి. అలాగే మీరు పడుకునే మంచంపై కాటన్ బెడ్ షీట్స్ మాత్రమే వాడాలి. ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, రాత్రిపూట తేలికపాటి భోజనం చేయడం ఉత్తమం. అతిగా మసాలాలు ఉన్న పదార్థాలు లేదా నూనెలో వేయించిన వస్తువులు తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, దీనివల్ల శరీరంలో వేడి పెరిగి నిద్ర పట్టదు. పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందే భోజనం ముగించాలి.
చాలామంది వేసవిలో దాహం వేస్తుందని రాత్రిపూట పడుకునే ముందు ఎక్కువ నీళ్లు తాగుతుంటారు, దీనివల్ల అర్ధరాత్రి పదే పదే మేల్కొనాల్సి వస్తుంది. కాబట్టి రోజంతా తగినంత నీరు తాగి, రాత్రి పడుకునే ముందు పరిమితంగా తీసుకోవడం మంచిది. అలాగే కెఫీన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలకు రాత్రిపూట దూరంగా ఉండాలి. ఒకవేళ ఏసీ వాడుతున్నట్లయితే ఉష్ణోగ్రతను 24 నుండి 26 డిగ్రీల మధ్య ఉంచుకోవడం ఆరోగ్యానికి మంచిది. మరీ తక్కువ ఉష్ణోగ్రత పెడితే తెల్లవారుజామున చలి పెట్టి నిద్రకు భంగం కలుగుతుంది. సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ ల నుండి వచ్చే నీలి కాంతి నిద్రను దూరం చేస్తుంది కాబట్టి, పడుకోవడానికి గంట ముందు వాటిని పక్కన పెట్టేయాలి. ఈ చిన్నపాటి జీవనశైలి మార్పులు చేసుకుంటే వేసవి తాపాన్ని తట్టుకుని హాయిగా నిద్రపోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి