రాజంపేట నియోజకవర్గం..ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. కడప జిల్లాలో దివంగత వైఎస్సార్ హవా ఎక్కువగా నడిచిన మరో ముఖ్య నియోజకవర్గం కూడా. అందుకే ఇక్కడ కాంగ్రెస్ వరుస విజయాలు నమోదు చేసింది. అయితే టీడీపీ ఆవిర్బావంతో కొంత మార్పు వచ్చినా, తాత్కాలిక అవసరాల కోసం అభ్యర్ధులను మార్చుతుండటంతో పట్టు సాధించలేకపోయింది. కానీ 2014 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ గెలిచినా, ఇక్కడ మాత్రం తెలుగుదేశం గెలుపుతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

 

టీడీపీ తరుపున మేడా మల్లిఖార్జునరెడ్డి విజయం సాధించారు. ఇక ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉండటంతో బాగానే పనిచేసుకున్నారు. కాకపోతే కడపలో టీడీపీ మనుగడ సాధించడం కష్టమని భావించి మేడా 2019 ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీలోకి వచ్చేశారు. ఇక ఎన్నికల్లో కూడా మేడా టిక్కెట్ దక్కించుకుని రాజంపేట నుంచి పోటీ చేసి, టీడీపీ సీనియర్ నేత బత్యాల చెంగల్రాయుడుపై దాదాపు 35 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

 

అయితే టీడీపీని వదలడమే మేడాకు ప్లస్ అయింది. అందుకే రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలవగలిగారు. ఇక ఎమ్మెల్యేగా మేడా...రాజంపేట ప్రజలకు బాగానే అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలని ఎక్కువగా ప్రచారం చేస్తూ, ప్రజలకు అందిస్తున్నారు. ఇక పథకాలు అమలులో ముందున్నా, అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉన్నారు. సంవత్సర కాలంలో ఇక్కడ జరిగిన అభివృద్ధి శూన్యం.

 

రాజంపేట పట్టణంలో వాహనాల రాకపోకలు ఎక్కువయ్యాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు కూడా పెరిగాయి. ఇక్కడ రింగురోడ్డు నిర్మించాలని డిమాండ్‌ చాలా రోజుల నుంచి ఉంది. అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక అభివృద్ధికి నోచుకోవడంలేదు. రాజంపేట - రాయచోటి రహదారిని విస్తరణ చేయాలి. అలాగే అన్నమయ్య కాలిబాట అభివృద్ధి చేయాలి. వైఎస్‌ హయాంలోనే దీనిపై ప్రతిపాదించినప్పటికీ తరువాత మరుగున పడింది. ఒంటిమిట్ట-వీరబల్లె మధ్య రహదారి సౌకర్యం నిర్మించాలి. రాజంపేటలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి.

 

ఇన్ని సమస్యలు ఉండటంతో రాజంపేట ప్రజలు మేడాపై కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీ నేత చెంగల్రాయుడు ప్రజా సమస్యలపై బాగానే పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పేరున్న చెంగల్రాయుడు...ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెడుతూ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తప్పులని ఎత్తి చూపుతున్నారు. ఇటు నియోజకవర్గంలో కూడా కార్యకర్తలని కలుపుకునిపోతూ, పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళుతున్నారు.

 

కానీ రాజంపేట వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట కాబట్టి, ఇక్కడ వైఎస్సార్‌సీపీ బలం ఏ మాత్రం తగ్గే ఛాన్స్ లేదు. దీంతో భవిష్యత్‌లో మేడాకు పెద్దగా ఇబ్బంది ఉండే అవకాశం లేదు. ఏదేమైనా టీడీపీని వీడటమే మేడాకు బాగా కలిసొచ్చినట్లుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: