ఇంటర్నెట్ డెస్క్: దేశంలో డిజిటల్ పేమెంట్స్ మొదలైన తరువాత కోట్ల మంది ప్రజలు ఆన్‌లైన్‌లోనే పేమెంట్స్ చేస్తున్నారు. అందులోనూ ఫోన్‌పే, గూగుల్ పే, భారత్ పే వంటి అనేక యూపీఐ అప్లికేషన్లను నగదు చెల్లింపులకు వినియోగిస్తున్నారు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం సులభం కావడం, ప్రతి సారీ జేబులో నుంచి డబ్బులు తీయాల్సిన అవసరం లేకపోవడంతో ఈ విధానానికి అనేకమంది పూర్తిగా అలవాటైపోయారు. అయితే ఈ యూపీఐ పేమెంట్స్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అర్థరాత్రిళ్లు యూపీఐ పేమెంట్స్ చేయడానికి దూరంగా ఉంటేనే మంచిది. జాతీయ చెల్లింపుల సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశమవుంతోంది.

రానున్న కొద్ది రోజుల్లో యూపీఐ ఫ్లాట్‌ఫాంను అప్‌గ్రేడ్‌ చేయబోతున్నామని, అందువల్ల వినియోగదారులు యూపీఐ పేమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేషనల్‌ పేమెంట్స్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్పీసీఐ) సూచించింది. ఈ మేరకు గురువారం తన ట్విటర్‌లో ఒక ప్రకటన చేసింది. ''యూపీఐ చెల్లింపుల్లో వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు యూపీఐ ఫ్లాట్‌ఫాంలో కొన్ని మార్పులు చేస్తున్నాం. ఈ ప్రక్రియ అర్ధరాత్రి 1 గంట నుంచి 3గంటల మధ్య కొనసాగుతుంది. దీని వల్ల వినియోగదారులకు కొద్ది రోజుల పాటు అసౌకర్యం తలెత్తవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆ సమయంలో యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయకుండా ఉండేందుకు ప్రయత్నించండి'' అని ఎన్సీసీఐ పేర్కొంది.

ఇదిలా ఉంటే అర్థరాత్రి 1 గంట నుంచి 3 గంటల మధ్య కాకుండా ఇతర సమయాల్లో ఎప్పటిలానే చెల్లింపులు చేసుకోవచ్చని, దానివల్ల ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని తెలిపింది. ఇక్కడ ఆలోచింపజేసే విషయం ఏంటంటే.. ఎన్పీసీఐ తన ట్వీట్‌లో కొద్ది రోజులు అని మాత్రమే చెప్పింది. అంతేకానీ యూపీఐ ప్లాట్‌ఫాం అప్‌గ్రేడ్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు మొత్తం ఎన్ని రోజులు పడుతుందునే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో వినియోగదారుల్లో కొంత ఆందోళన నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: