ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్యాక్షన్ సినిమాలకు కూడా కాసుల వర్షం కురుస్తాయని నిరూపించిన సినిమా ‘నరసింహనాయుడు’. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ రేంజ్ ఏంటో టాలీవుడ్‌లో రుజువైంది. ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పే ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా..’ డైలాగ్ ఇప్పటికీ టాలివుడ్‌లో సెన్సేషనే. ఈ సినిమా నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. బి.గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్‌లోనే పవర్ ఫుల్ హీరోగా బాలకృష్ణకు పాపులారిటీ తెచ్చిపెట్టింది.

బాలకృష్ణ యాక్టింగ్‌కు చిన్ని కృష్ణ కథ, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్, మణిశర్మ మ్యూజిక్, బీ గోపాల్‌ డైరెక్షన్ ఇవన్నీ సినిమాకు భారీ ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. 2001 జనవరి 11న సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం అప్పట్లోనే రూ.30కోట్లు వసూలు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. 105 థియేటర్‌లలో 100 రోజులు దిగ్విజయంగా ఆడింది. కేవలం వారం రోజుల్లో 101 షోలు పూర్తి చేసుకుంది. అప్పట్లో అదో రికార్డు. ఇక నందమూరి బాలకృష్ణ నటనకు ఏకంగా నంది అవార్డు సైతం దక్కింది.

ఒక రోజు రచయిత పరుచూరి గోపాలకృష్ణ వద్దకు దర్శకుడు బీ గోపాల్‌ వెళ్లారు. అప్పటికే కలిసి ఓ సినిమా తీద్దామని వారు అనుకుంటున్నారు. ఈ సందర్భంగానే చిన్న చిన్న మూడు కథలను గోపాలకృష్ణకు వినిపించారు బీ గోపాల్. అందులో ‘పిల్లాడిని ఎత్తుకుని రైలులో నుంచి హీరో దిగే కథ’ ఆయనకు బాగా నచ్చింది. ఆ కథ రాసింది చిన్ని కృష్ణ. అయితే పరుచూరి బ్రదర్స్‌కు ఆ విషయం తెలియదు. ఆ తర్వాత బీ గోపాల్‌.. చిన్నికృష్ణను తీసుకుని వెళ్లారు.

గోపాలకృష్ణను కలిసిన చిన్ని కృష్ణ ‘సీమ సింహం’లో పోలీస్‌ ఆఫీసర్‌ కథను ఇంకో రకంగా చెప్పారు. కానీ ఆయనకు నచ్చలేదు. రెండు, మూడు రోజుల తర్వాత చిన్నికృష్ణ మళ్లీ వెళ్లి గోపాలకృష్ణకు మరో స్టోరీ లైన్ వినిపించారు. తాను బిహార్‌లో ఒక సంఘటన చూశానని, వాళ్ల గ్రామంపైకి ఎవరైనా దాడి చేస్తే, ఎదుర్కొనేందుకు ఇంటికి ఒక మగ పిల్లాడిని చొప్పున బలి పశువుగా ఇవ్వడం చూశానని, ఈ పాయింట్‌తో సినిమా తీద్దామని చిన్ని కృష్ణ అన్నారు. దీనికి అంగీకరించిన పరుచూరి.. కథ రాసుకురమ్మని చెప్పారట. పరుచూరి బ్రదర్స్‌తోనే కలిసి కూర్చుని చిన్ని కృష్ణ కొద్ది రోజులకు ‘నరసింహనాయుడు’ కథను సిద్ధం చేశారట.

సినిమా క్లైమాక్స్‌లో ఏదైనా భారీ డైలాగ్ ఉంటే బాగుంటుందని దర్శకుడు బీ గోపాల్.. పరుచూరి గోపాలకృష్ణ వద్దకు వచ్చి చెప్పారట. దీంతో అప్పటికప్పుడు ఆయన ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’ అని రాసిచ్చారట. అలా ఒక్క క్షణంలో రాసిచ్చిన డైలాగ్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఇక సినిమా కంప్లీట్ అయిన తరువాత చూసిన గోపాలకృష్ణ.. ఈ సినిమా మరో షోలే అవుతుందన్నారట. అయితే సెకండ్ హాఫ్ బాగా లెంగ్త్ అయిపోవడంతో బాగా కత్తెరలేసి, సీన్లను ముందుకు వెనక్కి మార్చి ఇప్పుడు మనం చూస్తున్న సినిమా రెడీ అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: