చిన్న సినిమాలకి థియేటర్లు దొరకవు అని ఇండస్ట్రీలో ఒక కంప్లైంట్‌ ఉంది. కానీ చిన్న హీరోలకి కూడా చాలా క్రేజ్ ఉంది. బడా, మీడియం రేంజ్ స్టార్స్ మధ్యలో థియేటర్లలో సందడి చేసేందుకు చిన్న హీరోలు కావాలని ఎగ్జిబిటర్స్‌ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. సంతోష్ శోభన్‌కి బిగినింగ్‌లో పెద్దగా హిట్స్‌ లేవు. 'తను నేను, పేపర్ బాయ్' లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా, జనాలకి పెద్దగా కనెక్ట్ కాలేదు. అయితే ఈ మధ్య సంతోష్‌ శోభన్‌కి వరుస సినిమాలు వస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో 'మంచి రోజులొచ్చాయి', నందినీ రెడ్డి దర్శకత్వంలో 'అన్ని మంచి శకునములే', అభిషేక్ మహర్షితో 'ప్రేమ్ కుమార్' సినిమాలు చేస్తున్నాడు సంతోష్ శోభన్.

కరోనా లాక్‌డౌన్‌ చాలామంది హీరోలకి నష్టాలు తీసుకొచ్చింది గానీ, సంతోష్‌ శోభన్‌కి ఈ పాండమిక్ కూడా కలిసొచ్చింది. ఓటీటీలో రిలీజైన 'ఏక్ మినీ కథ' సినిమాకి యూత్‌ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఓటీటీ మార్కెట్‌లో సాలిడ్ క్రేజ్ కూడా వచ్చింది. దీంతో మేకర్స్‌ కూడా డిజిటల్ మార్కెట్‌ ఉందనే ధీమాతో సంతోష్‌కి తెగ ఆఫర్స్‌ ఇస్తున్నారట.

కరోనా లాక్‌డౌన్‌లో ఓటీటీ మార్కెట్‌లో హడావిడి చేసిన హీరో సిద్ధు జొన్నలగడ్డ. 'క్రిష్ణ అండ్ హిజ్ లీల, మా వింత గాధ వినుమా' సినిమాలతో ఓటీటీ ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. యూనిక్‌ కామెడీ టైమింగ్‌తో సెపరేట్‌ ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. ఇప్పుడు 'డిజె టిల్లు' సినిమాతో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లోకి దిగిపోయాడు. మొత్తానికి చిన్న సినిమాలకు మంచి రోజులొస్తున్నాయి. ఆ సినిమాల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని థియేటర్లు కూడా ఆ సినిమాలకు అవకాశాలు ఇస్తున్నాయి. ఒకవేళ థియేటర్లు అవకాశం ఇవ్వకపోయినా.. ఓటీటీలు అక్కున చేర్చుకుంటున్నాయి. ఇంకేముందీ చిన్న సినిమాల మేకర్స్ ఆనందంలో మునిగిపోతున్నారు. తమకు మంచి ప్లాట్ ఫార్మ్ దక్కుతోందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: