పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే.


పూరి కనెక్ట్స్ కరణ్ జోహార్ కి చెందిన ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద ఈ సినిమాని కరణ్ జోహార్, అపూర్వ మెహతా, పూరి జగన్నాథ్, చార్మికౌర్ నిర్మించారు. విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కెరీర్లలో మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీ గా రూపొందిన ఈ సినిమా ఊహించిన మేర అంచనాలను అయితే అందుకోలేకపోయింది.


తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ఆగస్టు 25వ తేదీ విడుదలైన ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ టాక్ అందుకుంది. బాయ్ కాట్ ట్రెండుతో పాటు సినిమా కూడా ఆసక్తికరంగా లేకపోవడంతో సినిమాకు బాగా మైనస్ అయ్యిందట. ఈ నేపద్యంలో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న జనగణమన సినిమా కూడా ఆగిపోయింది. అయితే లైగర్ సినిమా కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు మా దగ్గర డబ్బు లేవు మేము ఇవ్వలేమని ఛార్మి తెగేసి చెప్పినట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. కానీ అది నిజం కాదని అంటున్నారు.


ఈ సినిమాకు గాను నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఆంధ్రాలో ఆరు కోట్లు, నైజాంలో నాలుగున్నర కోట్లు, సీడెడ్ ప్రాంతంలో రెండు కోట్ల పాతిక లక్షల రూపాయలు ఇవ్వడానికి పూరి కనెక్ట్స్ సంస్థ అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతేకాక జీఎస్టీ కూడా వెనక్కి చెల్లించేందుకు వారు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రల్లో వరంగల్ శీను రిలీజ్ చేశారట. మరి ఆయన ఈ అమౌంట్ అందుకున్నారా లేక ఆయన దగర సినిమా కొనుక్కున్న వారు అందుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.


కొద్దిరోజులుగా అనేక రకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో చార్మి కౌర్ సోషల్ మీడియాకి దూరమవుతున్నానని ప్రకటించింది. ఆ తర్వాత కూడా ఆమె దూరమవ్వడం సంగతి పక్కన పెట్టి తమ గురించి అనేక పుకార్లు ప్రచారాలు జరుగుతున్నాయని అవేవీ నిజం కాదని త్వరలోనే వెనక్కి వస్తామని బలంగా సమాధానం చెబుతామని ఆమె చెప్పుకొచ్చారు. ఇక జనగణమన సినిమా గురించి విజయ్ దేవరకొండని సైమా అవార్డుల వేదిక మీద ప్రశ్నిస్తే ఇప్పుడు దాని గురించి ఎందుకు దాని సంగతి మరిచిపోదాం ఇప్పుడున్న దాని గురించి మాట్లాడదాం అంటూ కామెంట్స్ చేయడంతో ఇక ఆ సినిమా నిలిచిపోయిన విషయం ఖాయమే అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే అది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: