
చిన్నప్పటి నుండే కష్టాలు చూస్తూ పెరిగిన శ్రీహరి.. లైఫ్ లో జిమ్నాస్టిక్స్, వ్యాయామం కూడా ముఖ్యపాత్ర పోషించాయి. యుక్త వయసుకు వచ్చేసరికి శ్రీహరి కండలు తిరిగిన దేహంతో ఎన్నో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ లో విజేతగా నిలిచారు. మరోవైపు డిగ్రీ పూర్తి చేయడమే కాకుండా.. సినిమాల మీద ఇంటరెస్ట్ తో రైల్వే, పోలీస్ శాఖల ఉద్యోగాలను కూడా రిజెక్ట్ చేశారు. ఇక జిమ్నాస్టిక్స్ తెలుసు కాబట్టి.. కొంతమంది సలహా మేరకు 1986లో స్టంట్ ఫైటర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. అలా దాసరి నారాయణ రావు 1987లో తెరకెక్కించిన బ్రహ్మనాయుడు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు శ్రీహరి.
ఇదిలా ఉండగా.. ఇండస్ట్రీ సైడ్ క్యారెక్టర్స్, కామెడీ రోల్స్ చేస్తున్న తరుణంలో తాజ్ మహల్, ప్రేయసిరావే లాంటి సినిమాలు శ్రీహరి నటుడిగా పూర్తి స్థాయిలో ఆవిష్కరించాయి. ప్రేయసి రావే సినిమాలో శ్రీహరి నటన చూసి.. ఆ తర్వాత అయోధ్య రామయ్య, ఒక్కడే, హనుమంతు లాంటి వరుస హిట్స్ తో శ్రీహరిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు డైరెక్టర్ చంద్రమహేశ్. ఆ తర్వాత నుండి శ్రీహరి కెరీర్ పరంగా ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. నటుడిగానే కాదు.. ఇండస్ట్రీలో పవర్ ఫుల్ గా, చాలా స్పష్టంగా గుక్కతిప్పుకోకుండా డైలాగ్స్ చెప్పేవారిలో శ్రీహరి ముందువరుసలో ఉంటారు.
అలా కెరీర్ లో ఎన్నో హిట్స్ చూసిన ఆయనకు ఢీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మగధీర లాంటివి శ్రీహరిని చిరస్థాయి నటుడిగా నిలిపాయి. శ్రీహరి కూడా పలు ఇంటర్వ్యూలలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మగధీర చిత్రాలలో చేసిన క్యారెక్టర్స్ తనకు ఆల్ టైం ఫేవరేట్ అని చెప్పారు. రియల్ స్టార్ శ్రీహరి గారు 2013లో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య శాంతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భౌతికంగా శ్రీహరి ఇప్పుడు లేకపోయినా.. గొప్ప మనిషిగా, మనసులకు దగ్గరైన నటుడిగా ఎల్లప్పుడూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలా ఉండిపోతారు రియల్ స్టార్ శ్రీహరి.