ఈ మధ్యకాలంలో మలయాళం లో హిట్ అయిన మంచి సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని తాజాగా మలయాళం లో ఇండస్ట్రీ హీట్ గా నిలిచిన 'వికృతి' అనే సినిమాని తెలుగులో 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' అనే టైటిల్ తో రీమేక్ చేశారు. ప్రముఖ కమెడియన్, నటుడు అయిన అలీ, సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు 'ఆహా' ఓటీ టీ లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మన సమీక్షలో తెలుసుకుందాం...


కథ విషయానికొస్తే: నరేష్ (శ్రీనివాసరావు) పవిత్ర లోకేష్ (సునీత) ఎంతో అన్యోన్యంగా ఉంటే దంపతులు. వయసు పైబడుతున్నా కూడా ఇద్దరూ ఒకరిపై ఒకరు అపారమైన ప్రేమను చూపిస్తూ ఉంటారు. అలా కొడుకు కూతురుతో ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్న నరేష్, పవిత్ర లోకేష్ జీవితాలు అలీ (మహమ్మద్ సమీర్) తీసిన ఓ ఫోటో కారణంగా అస్తవ్యస్తంగా మారుతాయి. దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చిన అలీ (మహమ్మద్ సమీర్) కి సెల్ఫీల పిచ్చి. ఆ సెల్ఫీల పిచ్చితోనే ఓ పెద్ద సమస్యలో ఇరుక్కుపోతాడు. ఇంతకీ ఆ సమస్య ఏంటి.? ఈ సమస్య మధ్యలో అలీ దిల్ రూబ (హీరోయిన్ మౌర్యానీ) తో ఎలా ప్రేమలో పడ్డాడు.? వీళ్ళ ప్రేమ పెళ్లికి దారితీసిందా? లేదా? చివరకు నరేష్ పవిత్ర లోకేష్ జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది మిగతా కథ...



విశ్లేషణ విషయానికొస్తే:   సినిమా చూస్తున్నంత సేపు మన రియల్ లైఫ్ లో పాత్రలనే మనం దగ్గరుండి చూసినట్లుగా అనిపిస్తుంది. సినిమాకి ప్రధాన బలం కథలోని సెన్సిటివ్ ఎమోషన్స్ అండ్ ఫీల్డ్ సీన్స్. ముఖ్యంగా సినిమాలో భావోద్వేగమైన పాత్రలతో కూడా సున్నితమైన హాస్యాన్ని పండించిన విధానం ఆకట్టుకుంటుంది. అలాగే ప్రధానంగా సాగే నరేష్, పవిత్ర లోకేష్ మధ్య ప్రేమ, వాళ్లు పడే బాధ ప్రేక్షకుడిని సినిమాతోనే ప్రయాణించేలా చేస్తాయి. ఇక కథనంలో కూడా ఎక్కడ ప్లో అనేది తగ్గకుండా ప్రతి ఐదు నిమిషాలకు ఒక ఎమోషన్ సీన్ లేదా ఒక కామెడీ సీన్ వస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా ఒక సాధారణ మనిషి ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతాడు అనే కోణంలో కొన్ని కఠినమైన వాస్తవాలను చాలా వాస్తవికంగా ఈ సినిమాలో చూపించడం బాగా ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన అలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో అలీ హీరోగా కూడా చాలా బాగా మెప్పించాడు. సినిమాలో తన పాత్రకు నటనతోనే ప్రాణం పోశాడు. అలాగే పక్కింటి ఫ్రెండ్ పాత్రలో సింగర్ మనో ఆకట్టుకున్నాడు. కథను మలుపు తిప్పే పాత్రలో లాస్య కూడా చక్కగా నటించింది. ఆమె పాత కారణంగానే సినిమాలో టర్నింగ్ పాయింట్ చోటు చేసుకుంటుంది. ఇక సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ కి కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకున్నారు. ఇదే సినిమాకు బాగా ప్లస్ అయింది. అలాగే ఈ రీమేక్లో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా డిజైన్ చేయడం చాలా బాగుంది. దీని కారణంగానే ఒరిజినల్ వెర్షన్ 'వికృతి' కంటే ఈ సినిమా ఓ మెట్టు పైనే ఉంది. ఇక సినిమా చివరికి వచ్చేసరికి సినిమాలో పాత్రలకు ఏం జరుగుతుందో అనే ఉత్సుకతను దర్శకుడు బాగా మెయింటైన్ చేశాడు. ఇక క్లైమాక్స్ మూసేసరికి సినిమా మీద మంచి భావోద్వేగంతో కూడుకున్న అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా ఈ కథలో నరేష్, పవిత్ర లోకేష్ మరోసారి అద్భుతమైన ఎమోషనల్ కెమిస్ట్రీని చాలా బాగా పండించారు. నరేష్ పవిత్ర లోకేష్ నిజ జీవితంలో కెమిస్ట్రీనే ఈ సినిమాలో చూస్తున్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఇక సినిమాలో ప్రధాన పాత్రధారులుగా నటించిన మౌర్యాని, మంజు భార్గవి, తనికెళ్ల భరణి, ఎస్ వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సప్తగిరి, పృద్వి, భద్రం, లాస్య తమదైన పాత్రలతో ఆకట్టుకున్నారు. ఇక సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే రక్త మాంసాలు ఉన్న పాత్రల తాలూకు గొప్ప జర్నీని ఈ సినిమాలో మనం చూడొచ్చు...

ప్లస్ పాయింట్స్:

అలీ నటన
మెయిన్ థీమ్
నరేష్ - పవిత్రలోకేష్ మధ్య కెమిస్ట్రీ
కొన్ని ఫ్యామిలీ ఎపిసోడ్స్
సంగీతం


రేటింగ్:3.25/5


బోటమ్ లైన్: మెప్పించే ఎమోషనల్ డిజిటల్ ఫ్యామిలీ డ్రామా..

స్ట్రీమింగ్: ఆహా ఓటీటీ

బ్యానర్: అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్

నిర్మాత: కొనతాల మోహన్

రచన, దర్శకత్వం: శ్రీపురం కిరణ్

సంగీతం: రాకేశ్ పళిడమ్

మరింత సమాచారం తెలుసుకోండి: