ఈ భూప్రపంచంలో వాస్తవానికి మనుషుల కంటే డబ్బుకు ఎక్కువ విలువ లేకపోయినా మనుషులు మాత్రం దానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సగం నేరాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో డబ్బే కారణమవుతుందంటే మానవులు ఎంత స్వార్థంగా మారారో అర్థమవుతుంది. డబ్బు వల్లే మానవ సంబంధాలు చెడిపోతున్నాయి. డబ్బు వల్లే పలు సందర్భాల్లో స్నేహితులు సైతం శత్రువులవుతున్నారు. 
 
డబ్బుంటే కొండమీద కోతి కూడా దిగొస్తుందని నమ్మి చాలమంది ధనార్జనకే రోజులో అధిక సమయం కేటాయిస్తున్నారు. అలాగని డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంటే మాత్రం జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుత కాలంలో దేశవ్యాప్తంగా చిన్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నా గ్రామాల్లో నేటికీ ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఈ ఉమ్మడి కుటుంబాలలో బేధాభిప్రాయాలు రానంత వరకు ఎటువంటి సమస్య ఉండదు. 
 
బేధాభిప్రాయాలు మొదలైతే మాత్రం ఆస్తుల పంపకాలు, ఇతర విషయాల్లో గొడవలు అంతకంతకూ పెరుగుతాయి. అప్పటివరకు అన్ని విషయాల్లో సర్దుకుపొయిన కుటుంబ సభ్యులు ఆస్తుల విషయంలో మాత్రం గొడవలు పడుతూ గోరంత సమస్యను కొండంత సమస్యగా మార్చుకుంటూ ఉంటారు. క్షణాల్లోనే సొంత అన్నాదమ్ములు సైతం ఈ ధనం వల్ల ఒకరికొకరు వ్యతిరేకంగా తయారవుతారు. అలా విడిపోయిన బంధాలు మరలా కలవడం కూడా కష్టమే అవుతోంది. 
 
జీవితంలో ధనం ముఖ్యమే. కానీ ధనం మాత్రమే ముఖ్యం కాదు. ధనం కోసం ముఖ్యమైన వాటిని వదులుకుంటే జీవితంలో ఎంతో విలువైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. మనుషుల జీవితంలో డబ్బు తాత్కాలిక ఆనందాన్ని పంచినప్పటికీ బంధాలే శాశ్వతం. అందువల్ల జీవితంలో డబ్బు కోసం బంధాలను వదులుకోకూడదు. అవసరమైతే ఇతరులకు తగినంత సహాయం చేస్తూ బంధాలు, రక్త సంబంధాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ జీవించడం ఉత్తమం.                        

మరింత సమాచారం తెలుసుకోండి: