
మెగాస్టార్ చిరంజీవి , ఈరోజు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తనదైన శైలిలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్విట్టర్లో షేర్ చేశారు. ఇప్పుడు అది కాస్తా వైరల్ గా మారింది.. మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్లో .."సహనానికి మారుపేరు.. మల్లె పువ్వు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వారు సంతోషంగా వుండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను..పుట్టినరోజు శుభాకాంక్షలు సర్..! " అంటూ ట్వీట్ చేశారు. ఆయనతో పాటు ఎంతో మంది సినీ ప్రముఖులు కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కరోనా సమయంలో ఎంతోమందిని ఎన్నో రకాలుగా ఆదుకుంటున్న విషయం తెలిసిందే. ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆక్సిజన్ అందించాలన్న ఆలోచనతోనే ఆయన ఈ సంకల్పానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అడిగిన వారికి కాదనకుండా, ఏ సమయంలో నైనా సరే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు.
ఇక చిరంజీవి నటిస్తున్న సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ విడుదల తేదీని వాయిదా వేశారు. ఇందుకు కారణం సినిమా షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో కారణమని కొంతమంది అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమాను మే 14వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. కానీ ప్రస్తుతం ఫైనల్ షూట్ లో రామ్ చరణ్ , సోనూ సూద్ల మధ్య యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఏప్రిల్ నెలలో అనుకోకుండా సోనుసూద్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అందుకే అప్పుడు షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత తిరిగి కరోనా కారణంగా లాక్ డౌన్ పెట్టడంతో మరోసారి షూటింగ్ ఆగిపోయింది. అందుకే చిత్రం యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని మరోసారి పోస్ట్ పోన్ చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా చిరంజీవి లూసిఫర్ రీమేక్చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో వేచి చూడాలి మరి.