మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. కమర్షియల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ సినిమాతో తన రీ ఎంట్రీ తర్వాత భారీ ఫ్లాప్ ను అందుకున్నాడు చిరు. దాంతో తన తదుపరి సినిమాల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన గాడ్ ఫాదర్ మరియు భోళా శంకర్ సినిమాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే కావడం గమనార్హం. ఈ విషయం కాస్త పక్కన పెడితే అవుట్ పుట్ విషయంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి పక్కాగా ఉన్నట్లు తెలుస్తోంది.

అవసరం అయితే రీషూట్స్ చేయించే ప్లాన్ లో కూడా ఉన్నాడట. అయితే వీటితో పాటు మరో రెండు ప్రాజెక్టులను కూడా ఇప్పటికే ఓకే చేసాడు మెగాస్టార్. అందులో ఒకటి దర్శకుడు బాబీ తో.. మరొకటి యువ దర్శకుడు వెంకీ కుడుములతో సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలు పూర్తయిన తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నట్లు లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమాని చిరంజీవి ఎప్పుడో ప్రకటించారు. కానీ అధికారికంగా కార్యరూపం దాల్చడానికి ఇంత సమయం పట్టింది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి ప్రారంభం కాబోతోంది. ఇక మహేష్ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవితో సినిమాని పట్టాలెక్కించబోతున్నాడట త్రివిక్రమ్. గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన జై చిరంజీవ సినిమాకి త్రివిక్రమ్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు. విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్గా విజయాన్ని అందుకోలేకపోయిన బుల్లి తెరపై మాత్రం బంపర్ హిట్ సాధించింది. ఇక మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే సహజంగా దీనిపై భారీ అంచనాలు ఉంటాయి. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరంజీవిని ఎలాంటి రోల్ లో చూపిస్తాడో వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి నిర్మాతగా డి.వి.వి.దానయ్య వ్యవహరిస్తాడని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: