క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ జానర్లలో వచ్చే చిత్రాల మీద ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. కరోనా తరువాత ఇలాంటి జానర్లనే జనాలు ఎక్కువగా ఇష్టపడుతన్నారు. క్రైమ్ అంటే అందరికీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ గుర్తుకు వస్తుంది. కానీ క్లూస్ టీం ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయడమే అథర్వలో కొత్త పాయింట్. కార్తీక్ రాజు సిమ్రన్ చౌదరి ఐరాలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని మహేష్ రెడ్డి తెరకెక్కించాడు. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వేసిన ప్రీమియర్స్ నుంచి టాక్ బయటకు వచ్చింది.

కథ
దేవ్ అథర్వ కర్ణ (కార్తీక్ రాజు) ఊర్లో ఉంటాడు. ఎలాగైనా పోలీస్ అవ్వాలని అనుకుంటాడు. పోలీస్ అయిపోయి కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేయాలని కలలు కంటూ ఉంటాడు. కానీ అతని అనారోగ్య సమస్యల కారణంగా పోలీస్ సెలక్షన్స్‌లో ఫెయిల్ అవుతుంటాడు.చివరకు క్లూస్ టీంలో జాయిన్ అవుతాడు. అందులో జాయిన్ అయిన తరువాత కేసుల కోసం తెగ పరితపిస్తుంటాడు. అలాంటి కర్ణకు ఓ దొంగతనం కేసు వస్తుంది. దాన్ని క్షణాల్లో పరిష్కరిస్తాడు. ఆ టైంలోనే తన కాలేజ్ జూనియర్ అయిన నిత్య (సిమ్రన్ చౌదరి) క్రైమ్ రిపోర్టర్‌గా కనిపిస్తుంది. కాలేజ్ రోజుల నుంచి ఆమె మీదున్న ప్రేమను మాత్రం బయటకు చెప్పలేకపోతాడు కర్ణ. నిత్య ఫ్రెండ్ జోష్ని (ఐరా) పెద్ద హీరోయిన్. అలా జోష్ని, నిత్య, కర్ణలు ఫ్రెండ్స్‌ అవుతారు. ఓ సారి కర్ణ, నిత్యలు జోష్ని ఇంటికి వెళ్తారు. అలా వాళ్లిద్దరూ ఆమె ఇంటికి వెళ్లిన తరువాత షాక్ అవుతారు. అక్కడ జోష్ని, ఆమె ప్రియుడు శివ (శివ) శవాలై పడి ఉంటారు. ప్రేయసి మీదున్న అనుమానంతోనే ఆమెను చంపి.. అతను కూడా సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు కేసు కొట్టేస్తారు. వేరే వ్యక్తి చంపాడని,  అక్కడ మర్డర్ జరిగిందని అని చెప్పడానికి ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో కేసును క్లోజ్ చేస్తారు. కానీ జోష్ని, శివల మీదున్న నమ్మకంతో నిత్య మాత్రం ఆ విషయాన్ని నమ్మదు. దీంతో కర్ణ రంగంలోకి దిగుతాడు. ఆ కేసును సాల్వ్ చేయాలని అనుకుంటాడు. జోష్ని, శివల నేపథ్యం ఏంటి? వాళ్లిద్దరినీ ఎవరు, ఎందుకు చంపారు? అసలేం జరిగి ఉంటుంది? ఒక్క క్లూ కూడా లేని ఈ కేసును కర్ణ ఎలా పరిష్కరించాడు? అన్నదే కథ

నటీనటులు
కార్తీక్ రాజు పోషించిన కర్ణ పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. కామెడీ, సీరియస్ నెస్, లవ్ యాంగిల్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ చూపించాడు. హీరోయిజం కోసం కావాలని సీన్లు, ఫైట్లు పెట్టుకోలేదు. సహజంగా నటించాడు. హీరోయిన్ సిమ్రన్ చౌదరి తెరపై అందంగా కనిపించింది. సినిమాలో సినిమా హీరోయిన్ జోష్నిగా కనిపించిన ఐరా కూడా ఓకే అనిపిస్తుంది. పోలీసు పాత్రలు బాగున్నాయి. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు ఓకే అనిపిస్తాయి.

విశ్లేషణ
దర్శకుడు మహేష్ రెడ్డి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయినట్టుగా అనిపిస్తుంది. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లకు ఎలాంటి కథ, కథనాలు ఉంటే ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారో అలాంటి పాయింట్‌తోనే రాసుకున్నాడు. అయితే ఈ ఫార్మాట్‌లో ఇది వరకు చాలానే కథలు వచ్చాయి. కానీ ఓ పోలీస్ కాకుండా.. ఓ క్లూస్ టీం ఆఫీసర్ ఎలాంటి క్లూలు లేకుండా ఇన్వెస్టిగేట్ చేయడమే అథర్వలో కొత్తగా ఉంటుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లలో వచ్చే చిత్రాలు ఒకసారి చూశాక.. రెండో సారి ట్విస్టులు అన్నీ తెలిసిపోవడంతో అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించకపోవచ్చు. కానీ అథర్వ మాత్రం అలా అనిపించకపోవచ్చు. ఎంగేజింగ్‌గా తీయడంలో సక్సెస్ అయ్యాడు.

ప్రథమార్దం కాస్త నెమ్మదిగా ప్రారంభం అవుతుంది. అసలు కథ ప్రారంభించడానికి కాస్త టైం తీసుకుంటాడు. రాబరీ కేసు నుంచి సినిమా ఊపందుకుంటుంది. హీరోయిన్ జోష్ని మర్డర్‌తో సినిమా లైన్లో పడుతుంది. ఇంటర్వెల్‌కు మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక ద్వితీయార్దం ప్రారంభం మళ్లీ స్లో అనిపిస్తుంది.ఆ తరువాత సినిమా చకచకా పరుగులు పెడుతూనే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. ఈ క్రమంలో అప్పటి వరకు చూసిన అంతా ఒకెత్తు అయితే.. చివర్లో ఒకెత్తులా ఉంటుంది. ఇక అథర్వ రెండో పార్ట్‌కి కూడా మంచి లైన్‌ను రెడీ చేసుకున్నాడు. ఇలా మొత్తానికి దర్శకుడు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలం అయ్యాడనిపిస్తోంది.

టెక్నికల్‌గా ఈ సినిమా అదిరిపోతుంది. కెమెరామెన్ చరణ్ మాధవనేని ఇచ్చిన విజువల్స్.. సినిమా మూడ్‌ను బాగానే క్యారీ చేసింది. శ్రీ చరణ్ పాకాల పాటలు బాగుంటాయి. కానీ ఆర్ఆర్ మీదే అందరి దృష్టి పడుతుంది. ఎడిటర్ ఈ సినిమాను షార్ప్ అండ్ క్రిస్పీగానే కట్ చేశాడు. సెకండాఫ్ పరుగులు పెట్టినట్టుగా అనిపిస్తుంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా బాగానే ఖర్చు చేసినట్టుగా కనిపిస్తోంది. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చినట్టే కనిపిస్తోంది.

రేటింగ్ 3/5

మరింత సమాచారం తెలుసుకోండి: