హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో హ్యూమన్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి దగ్గర ఎలాంటి పేలుడు పదార్థాలు లభించవు. కానీ అతనే బ్లాస్ట్‌ అవుతాడు. ఇది ఉగ్రవాదుల పని.. వారి ప్లాన్‌ ఏంటో కనుక్కోవాలని సీక్రెట్‌ ఏజెన్సీ రుద్రనేత్రని ఆదేశిస్తాడు ముఖ్యమంత్రి(రాహుల్‌ రవీంద్రన్‌). రుద్రనేత్ర అనే సీక్రెట్‌ ఏజెన్సీ మేజర్ ప్రసాద్ రావు (మురళీ శర్మ) నడిపిస్తుంటాడు. అతని టీమ్‌లో పనిచేసే చారి(వెన్నెల కిశోర్‌)కి బాంబ్‌ బ్లాస్ట్‌ కేసుని అప్పగిస్తాడు. ఈ మిషన్‌ని చారి ఎలా పరిష్కరించాడు? ఈ మిషన్‌లో ఏజెంట్‌ ఈషా(సంయుక్త విశ్వనాథన్‌) పాత్రేంటి? అసలు ఆత్మాహుతి దాడుల వెనుకున్నదెవరు? వారి లక్ష్యమేంటి? మహి, రావణ్‌లా ప్లాష్‌ బ్యాక్‌ స్టోరీ ఏంటి? ఏజెంట్ ప్రియా (పావని రెడ్డి), రాహుల్ (సత్య), శ్రీనివాస్ (బ్రహ్మజీ) పాత్రలు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
చారి 111లో వెన్నెల కిశోర్‌ హీరో అనగానే..అందరి దృష్టి సినిమాపై పడింది.టీజర్‌, ట్రైలర్‌ చూడగానే ఇదొక కామెడీ ఎంటర్‌టైనర్‌ అని అర్థమైపోయింది. సినిమా మొత్తం కామెడీగానే సాగుతుంది. సీరియస్‌ అంశానికి కామెడీ జోడించి.. హిలేరియస్‌గా సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు. అయితే ఎంత కామెడీ సినిమా అయినా... కొంచెం అయినా లాజిక్‌ ఉండాలి. అది చారి 111లో మిస్‌ అయింది. సీక్రెట్‌ ఏజెన్సీ ఎలా పనిచేస్తుంది? పై అధికారులు ఎలా వ్యవహరిస్తారు. ఓ సీఎంతో అధికారి ఎలా మాట్లాడుతాడు? రియాల్టీకి పూర్తి విరుద్ధంగా కథనం సాగుతుంది. ఫస్టాఫ్‌ అంతా సోసోగా సాగినప్పటికీ..కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హీరోయిన్‌ చేసే యాక్షన్‌ సీన్‌ ఫస్టాఫ్‌కి హైలెట్‌. ఇంటర్వెల్‌ సీన్‌ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే సాగుతుంది. మహి, రావణ్‌లా ప్లాష్‌ బ్యాక్‌ స్టోరీ ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్‌లో వెన్నెల కిశోర్‌ చేసే కామెడి మరింత బోర్‌ కొట్టిస్తుంది. క్లైమాక్స్‌ రొటీన్‌గా ఉంటుంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే.. చారి 111 ఎంటర్‌టైన్‌ చేస్తుంది.

చారి పాత్రకి వెన్నెల కిశోర్‌ తగిన న్యాయం చేశాడు. ఆయన నుంచి ప్రేక్షకులు ఎలాంటి కామెడీ ఆశిస్తారో అది ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఆయన డైలాగ్‌ డెలివరీ, కామెడీ టైమింగ్‌ ఆకట్టుకుంటుంది. ఈషా పాత్రలో సంయుక్త విశ్వనాథన్‌ ఒదిగిపోయింది. యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టేసింది. తెరపై చాలా గ్లామరస్‌గా కనిపించింది. మేజర్ ప్రసాద్ రావు గా మురళీ శర్మ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సత్య, తాగుబోతు రమేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. సైమన్ కె కింగ్ నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: