మరోసారి rrr మూవీలోని నాటు నాటు పాట మారుమోగిపోయింది. ఈసారి ఏకంగా ముగ్గురు అగ్ర హీరోలు కలిసి నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశారు.దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.
మార్చి 1న శుక్రవారం ప్రారంభమైన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ మూడో రోజున బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకొణె, కత్రీనా కైఫ్ పాల్గొననున్నారు. అయితే, అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ రెండో రోజు వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించారు బాలీవుడ్ ఖాన్ త్రయం షారుక్, సల్మాన్, అమీర్. ఈ రెండో రోజున సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ కలిసి ప్రదర్శనలు ఇచ్చారు.బాలీవుడ్‌లోని ముగ్గురు ఖాన్‌లు RRRలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ నాటు నాటుకు స్టేజీపై కలిసి డ్యాన్స్ చేశారు. నాటు నాటు హిందీ వెర్షన్ సాంగ్ నాచో నాచోకు సల్మాన్, షారుక్, అమీర్ ముగ్గురు ఖాన్‍ల త్రయం పాట హుక్ హుక్ స్టెప్ వేసి అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఇదే పాటకు తమ కెరీర్‌లోని ఐకానిక్ పాటల హుక్ స్టెప్స్‌ను ఒక్కొక్కరుగా వేసి చూపించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది.

ఇప్పుడు ఇదే వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మొదట ఈ ముగ్గురు జీనే కే హై ఛార్ దిన్ పాటతో మొదలు పెట్టి చివరగా చయ్యా చయ్యా అనే పాటతో ముగించినట్లు తెలుస్తోంది. ఇకపోతే బాలీవుడ్ మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ సల్మాన్ ఖాన్ అండ్ షారుక్ ఖాన్ నల్ల కుర్తాలు, పఠానీ సల్వార్‌లో ట్విన్ లుక్‌లో అందరినీ అట్రాక్ట్ చేశారు. ఇక అమీర్ ఖాన్ ఆకుపచ్చ కుర్తాలో తెల్లటి ప్యాంటు, బ్లాక్ బూట్‌లతో కనువిందు చేశాడు. ఈ ముగ్గురు ఖాన్స్ కలిసి డ్యాన్స్ చేస్తుంటే విజిల్స్, అరుపులతో స్టేజ్ మారుమోగిపోయింది.ఇలా ముగ్గురు ఖాన్స్ డ్యాన్స్ చేయడం చారిత్రక ఘట్టం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. "బాలీవుడ్‌లోని త్రిమూర్తులు ఒక వేదికపై, నాటు నాటుకు నృత్యం చేయడంతో ఇంటర్నెట్ షేక్ కానుంది" అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. "చరిత్రలో మళ్లీ దొరకని వీడియో", "ఇది ఐకానిక్ మూమెంట్. బాలీవుడ్‌లోని ముగ్గురు కింగ్స్ ఒక్కొక్కరి ఐకానిక్ స్టెప్స్ పంచుకుంటూ చివరిగా డ్యాన్స్ చేశారు", "నా 90-2000ల హృదయం నిండిపోయింది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా షారుక్ ఖాన్ తన పఠాన్ సినిమాలోని ఝూమ్ జో అనే టైటిల్ సాంగ్‌పై డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చాడు. తర్వాత ముగ్గురు ఖాన్స్ ఈ పాటలోని షారుక్ హుక్ స్టెప్పును స్టేజీపై ప్రదర్శించారు. వీరితోపాటు రెండో రోజు రాత్రి స్టార్ కిడ్స్ అయిన జాన్వీ కపూర్, అనన్య పాండే, ఖుషీ కపూర్, సారా అలీ ఖాన్‌తోపాటు సెలబ్రిటీ జంట రణవీర్ సింగ్-దీపికా పదుకొణెల ప్రదర్శనలు కూడా జరిగాయి. ఇదిలా ఉండగా, 3వ రోజు జామ్‌నగర్‌లో జరుగుతున్న అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాపులర్ సింగర్ అర్జిత్ సింగ్ ప్రదర్శన ఇవ్వనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: