బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో విక్కీ కౌశల్ కూడా ఒకరు. 2015లో 'మసాన్' సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి సినీ పరిశ్రమలో మంచి నటుడిగా తనదైన ముద్ర వేశారు.కమర్షియల్ కంటే ఛాలెంజింగ్ పాత్రలనే ఎక్కువగా ఎంచుకునే నటుడు విక్కీ కౌశల్‌కి తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడంలో అతియోశక్తి లేదు. ఇతను స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే నటుడిగా ఇండస్ట్రీలోకి రాకముందు, విక్కీ కౌశల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా తెర వెనుక పని చేశాడు. ఆ సమయంలోనే విక్కీ కౌశల్‌ జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిందంట. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

విక్కీ కౌశల్ లీడ్ యాక్టర్ కాకముందు గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో కపిల్ శర్మ షోకు గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ దర్శకనిర్మాతలను ఆహ్వానించారు. షోలో భాగంగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన నటుడు విక్కీ కౌశల్‌ జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్న విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా కోసం అనుమతి లేకుండా లొకేషన్‌లో షూటింగ్ చేశాం. షూటింగ్‌ సమయంలో పోలీసులు అక్కడ అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఇసుక మాఫియా లొకేషన్‌లో కాల్పులు జరిపినందుకు అక్రమ కార్యకలాపాల కేసులో విక్కీని అరెస్టు చేశారు. కానీ 'హరాంఖోర్' దర్శకుడు శ్లోక్ శర్మ విక్కీ కౌశల్‌ను విడిపించారు. అంతేకాదు రెండుసార్లు విక్కీ జైలుకు వెళ్లాడు' అన్నారు. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్‌లో దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో పాటు నటులు మనోజ్ బాజ్‌పేయి, పీయూష్ మిశ్రా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, హుమా ఖురేషి, వినీత్ కుమార్, పంకజ్ త్రిపాఠి కూడా ఈ షోలో ఉన్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: