అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులంతా కలిసి నటించిన చిత్రం మనం. ఈ సినిమా కథ కూడా వారికోసమే పుట్టిందా? అని అందరూ అనుకున్నారు. అంతగా ఆ సినిమా అక్కినేని కుటుంబంపై బలమైన ప్రభావాన్ని చూపింది.ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ దేవీ 70ఎంఎం థియేటర్ లో రీరిలీజ్ చేశారు. హీరో నాగచైతన్య ఈ సినిమాను థియేటర్ కు వెళ్లి చూశాడు. అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్న ఒక సన్నివేశాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సమంతతో వచ్చే సీన్‌లోనూ బాధపడుతున్నట్లు కనిపించాడు.దీంతో చై పక్కనే ఉన్న దర్శకుడు విక్రం కె.కుమార్ ఓదార్చాడు. దీనికి సంబంధించిన వీడియోను అన్నపూర్ణ స్టూడియోస్ వారు యూట్యూబ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. మనం సినిమా రీ రిలీజ్ కు కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. సమంత, నాగచైతన్య ఈ సినిమాలో కలిసి నటించారు. నిజజీవితంలో కూడా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. కొద్దికాలం కాపురం సజావుగా సాగింది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత సమంతకు మయోసైటిస్ రావడంతో సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం కథలను వింటోంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను తెలియజేయడంతోపాటు ఫొటోలను కూడా షేర్ చేస్తుంటుంది. ఇటీవలే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన విషయంలో సమంత పేరు కూడా వినిపించింది. నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్నాడు. శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారుడు రాజు జీవితకథ ఆధారంగా దీన్ని తీస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. సాయిపల్లవి కథానాయిక. ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాలనే యోచనలో నాగచైతన్య ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: