తెలుగు సినిమా రంగంలో ఒకప్పుడు బాక్స్ ఆఫీస్‌ను శాసించిన మిడ్-రేంజ్ హీరోలు ఇప్పుడు గట్టి పరీక్షను ఎదుర్కొంటున్నారు. గతంలో వీరి సినిమాలు థియేటర్లలోకి వస్తే కనీసం ఆంధ్రప్రదేశ్‌లో మూడు నుంచి ఐదు కోట్ల బిజినెస్ హామీగా ఉండేది. రెండు రాష్ట్రాలను కలిపి చూస్తే సులభంగా పది కోట్ల మార్కెట్ దాటేసేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో మిడ్-రేంజ్ హీరోలకు మూడు కోట్ల మార్కెట్ కూడా అందడం లేదు. రెండు రాష్ట్రాలను కలిపి ఆరు కోట్ల బిజినెస్ కూడా లాభసాటిగా కనిపించడం లేదు. పైగా, గతంలో వీరి సినిమాలకు బలమైన ఆదాయ వనరుగా ఉన్న ఓటీటీ రైట్స్, హిందీ డబ్బింగ్ హక్కులు కూడా బాగా తగ్గిపోయాయి.
 

ఒకప్పుడు హిందీ డబ్బింగ్ హక్కుల కోసం నిర్మాతలు క్యూలో నిలబడితే, ఇప్పుడు మాత్రం ఆ డీల్స్ కుదరడం కూడా కష్టమైంది . ఈ పరిస్థితుల్లో నిర్మాతలు మిడ్-రేంజ్ హీరోలతో సినిమాలు చేయడానికి జంకిపోతున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఒక ప్రముఖ నిర్మాత ఒక మిడ్-రేంజ్ హీరోతో చేయాలని అనుకున్న భారీ ప్రాజెక్ట్‌ను మధ్యలోనే డ్రాప్ చేశాడు. మరో హీరో సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయి, సెట్స్ మూతబడిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇక సమస్య ఇక్కడితో ఆగడం లేదు. మార్కెట్ తగ్గినా, మిడ్ - రేంజ్ హీరోలు తమ రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి తగ్గింపు చూపడం లేదు. నిర్మాతలకు స్క్రిప్టులు పంపుతూ ఉన్నా, అవి వారికి లాభసాటిగా అనిపించడం లేదు. ఫలితంగా, ప్రాజెక్టులు పేపర్ మీదే ఆగిపోతున్నాయి.



సినిమా ఇండస్ట్రీలో ఈ పరిస్థితి ఇలా కొనసాగితే, రాబోయే కొన్నేళ్లలో ఈ మిడ్ - రేంజ్ హీరోలు పబ్లిక్ మైండ్‌లోంచి మాయమయ్యే ప్రమాదం ఉందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రేక్షకులు ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకే ఎక్కువ ఆసక్తి చూపుతుండటంతో, మిడ్ - రేంజ్ హీరోలు తమ మార్కెట్‌ను నిలబెట్టుకోవాలంటే కథల ఎంపికలో కొత్తదనం, రెమ్యూనరేషన్‌లో తగిన తగ్గింపు తప్పనిసరి. ఒకప్పటి బాక్స్ ఆఫీస్ బుల్‌డోజర్లు, ఇప్పుడు సవాళ్లతో నిండిన రోడ్డు పై నడుస్తున్నారు. ఈ సవాళ్లను అధిగమించకపోతే , మిడ్-రేంజ్ హీరోల భవిష్యత్తు మరింత చీకటిలోకి జారిపోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: