కథ :
అర్జున్ (సౌమిత్ రావు) ఒక అనాథ. తన స్నేహితుడి (వైవా హర్ష) ఇంట్లో ఉంటూ యాడ్ ఏజెన్సీలో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుంటాడు. తన జీవితంలో ఒక తోడు ఉంటే బాగుంటుందని ఆశించినా, ఏ అమ్మాయి రాకపోవడంతో డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఎదురు అపార్ట్‌మెంట్‌లో అతిథి (శ్రేయాసి సేన్) కనిపిస్తుంది. ఆమెను చూడగానే ప్రేమలో పడిన అర్జున్, మెల్లగా పరిచయం పెంచుకుని దగ్గరవుతాడు. అతిథి కూడా అతడికి ఫిజికల్‌గా చేరువైనప్పటికీ, ప్రేమను మాత్రం అంగీకరించదు.
దీనికి గల కారణం ఏంటి, అతిథి ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి అనేది ఆసక్తికరం. పెళ్లి, పిల్లలతో స్థిరపడాలనుకున్న అర్జున్ కల నెరవేరిందా? శాంతను ఎవరు? అతిథి రాకతో అర్జున్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? చివరికి వీరిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ :
దర్శకులు సౌమిత్ రావు, సాయి వెన్నం ఒక మంచి ప్రేమకథను సంగీతంతో ముడిపెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో ఆత్మహత్యకు ప్రయత్నించే ఆసక్తికర సన్నివేశంతో సినిమా ప్రారంభమవుతుంది. ఒంటరితనం వల్ల కలిగే వేదనను అర్జున్ పాత్ర ద్వారా చూపించారు. జీవితంపై విరక్తి చెందిన సమయంలో హీరోయిన్ ప్రవేశించడంతో కథనం రొమాంటిక్‌గా మారుతుంది. వీరిద్దరి పరిచయ సన్నివేశాలు సహజంగా ఉంటాయి. అర్జున్‌ను ఇష్టపడుతున్నా అతిథి వెనకడుగు వేయడం వెనుక ఉన్న ఫ్లాష్‌బ్యాక్ ఏమిటనే క్యూరియాసిటీని చివరి వరకు కొనసాగించారు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థం ఎమోషనల్‌గా సాగుతూ, అతిథి ఫ్లాష్‌బ్యాక్ స్టోరీతో గుండెను బరువెక్కిస్తుంది. అయితే మధ్యలో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించినా, క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక గొప్ప అనుభూతిని అందిస్తుంది.
ఈ సినిమాలో హీరోహీరోయిన్లతో పాటు నటీనటులంతా కొత్తవారైనప్పటికీ చక్కగా నటించారు. అర్జున్ పాత్రలో సౌమిత్ రావు తన నటనతో పూర్తి న్యాయం చేయడమే కాకుండా, డ్యాన్స్‌తో ఇరగదీసి, ఎమోషనల్ సన్నివేశాలలోనూ అద్భుతంగా రాణించాడు. తెరపై ఆయన ఒక బాలీవుడ్ హీరోలా కనిపించాడు. ఇక అతిథిగా నటించిన శ్రేయాసి సేన్ తనదైన నటనతో ఆకట్టుకుంది; ఇది ఆమెకు తొలి సినిమా అయినప్పటికీ ఆ విషయం ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తపడి కథను తన పాత్ర చుట్టూ నడిపించింది. వైవా హర్ష కొన్ని చోట్ల నవ్వించగా, మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. సాంకేతికంగా చూస్తే, కళ్యాణ్ నాయక్ అందించిన నేపథ్య సంగీతం, వినసొంపుగా ఉన్న పాటలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. సినిమాటోగ్రఫీ బాగుండగా, ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
రేటింగ్ : 3.0/5.0
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి