జేమ్స్‌బాండ్ 007...ఈ పేరు చెప్పగానే మనకు బాండ్ పాత్రలో ఒదిగిపోయే నటులు ఒళ్లు గగుర్పొడిచేలా చేసే అద్భుత యాక్షన్ సన్నివేశాలు, శత్రు రహస్యాలు రాబట్టే క్రమంలో సాయపడే అతివలతో సాగించే రాసలీలలు ఠక్కున గుర్తొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల మనసు దోచుకుంటున్న బాండ్ సిరీస్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ సందర్భంగా రేపే(నవంబర్ 1న) మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
జేమ్స్ బాండ్ సిరీస్ లో 23వ సినిమాగా తెరకెక్కిన 'స్కైఫాల్'.. తెలుగులో 'లోకం చుట్టిన వీరుడు' టైటిల్ తో విడుదలవుతోంది. డేనియల్ క్రూగ్, హెలిన్ మెక్రోలి, బెరిన్స్మర్లోహ్, జావియర్ బార్టెన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సేమ్ మెండిస్ దర్శకత్వం వహించారు. 12 దేశాల్లో రేర్ లొకేషన్లలో తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ అందిస్తోంది. ఈ సినిమాను అమెరికా కంటే వారం రోజుల ముందు ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1న విడుదల చేస్తున్నారు. జేమ్స్ బాండ్ సినిమాలంటే అందరికీ ఆసక్తే. అందుకు కారణం అమెరికన్ గూఢాచారిగా జేమ్స్ బాండ్ చేసే సాహాసాలు, విన్యాసాలు చూడముచ్చటగా ఉంటాయి.
యాభై ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను అలరిస్తున్న జేమ్స్ బాండ్ సినిమాల కథ వెనుక అనేక ఆసక్తికర విశేషాలున్నాయి. ప్రఖ్యాత బ్రిటిష్ జర్నలిస్ట్ ఇయాన్ ఫ్లెమింగ్ రాసిన జేమ్స్‌బాండ్ నవలలకు విపరీతమైన క్రేజీ వచ్చింది. జేమ్స్‌బాండ్ నవలలు సాధించిన పాపులారిటీని, క్రేజ్‌ను ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ ఇయాన్ ప్రొడక్షన్స్ గమనించింది. 1961లో సినీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే తొలి సినిమాగా యాక్షన్ సస్పెన్స్ బాగా ఉన్న ‘డాక్టర్ నో’ను ఎంపిక చేసుకుంది. టెరెన్స్ స్టాంప్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించింది.
తొలి జేమ్స్‌బాండ్‌గా ‘సీన్‌కానరీ’ బాండ్‌గా పరకాయ ప్రవేశం చేశాడు. జేమ్స్‌బాండ్ సినిమాల 50 ఏళ్ల ప్రస్థానం వెనుక, తొలిసారిగా వెండితెరపై వేసిన అడుగులే కారణమని చెప్పాలి. ‘డాక్టర్ నో’ సినిమాలో జేమ్స్‌బాండ్ పాత్రని, జేమ్స్‌బాండ్ సినిమాలని ప్రత్యేకంగా, విశిష్టంగా చూపించడం కోసం దర్శకుడు టెరెన్స్ ఎన్నో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. ప్రేక్షకులలో బలమైన ఇంప్రెషన్ని వేయడంలో ఈ వినూత్న ప్రయోగాలన్నీ ప్లస్ అయ్యాయి. మొదటిగా జేమ్స్‌బాండ్ పాత్ర కేరెక్టరైజేషన్, స్టైల్, డ్రెస్సింగ్ అంశాలపై కాన్సెంట్రేట్ చేశారు.
ఆ తర్వాత సినిమా టైటిల్స్‌ని డిఫరెంట్‌గా చేయాలని ఆలోచించి డార్క్ షేడ్స్‌తో, సిల్హౌట్ షాట్స్ దృశ్యాలను దానికి తగిన థీమ్ మ్యూజిక్‌ని కంపోజ్ చేశారు. మోంటీ నార్మన్ జేమ్స్‌బాండ్‌కి థీమ్ మ్యూజిక్‌ని అందించి ఓ నవ్య ప్రయోగానికి నాంది పలికాడు. తాజాగా వస్తున్న స్కైఫాల్ సినిమా కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: