అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా కాటుకు వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. వైద్యులు తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. అమెరికాలో ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ప్రభుత్వం కరోనా వైరస్ కేసులు నమోదైన సమయంలో పెద్దగా పట్టించుకోలేదు. అమెరికాలో అత్యుత్తమ వైద్య సేవలు ఉన్నాయని... కరోనా సోకినా ఎటువంటి ప్రాణ నష్టం జరగదని ఆ దేశం భావించింది. 
 
అమెరికాలో మార్చి 1న తొలి కేసు నమోదు కాగా నేడు ఎవరూ ఊహించని స్థాయిలో ఆ దేశాన్ని కరోనా కమ్మేసింది. వైరస్ వ్యాప్తి చెందిన రెండు వారాల తరువాత న్యూయార్క్‌ నగర మేయర్‌ బిల్‌ బ్లాసియో స్కూళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 22న గవర్నర్‌ ఆండ్రూ క్యూమో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తూ లాక్ డౌన్ ప్రకటించారు. కానీ అప్పటికే ఎవరూ ఊహించని స్థాయిలో జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. 
 
గవర్నర్, మేయర్‌ మధ్య లాక్‌డౌన్, భౌతిక దూరం వంటి అంశాల్లో సమన్వయం కొరవడడంతో ప్రస్తుతం అమెరికాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాలో ఇప్పటివరకు 21,474 మంది కరోనా భారీన పడి చనిపోయారు. జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ అమెరికాలో గంటకు 83 మంది ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించింది. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 5,45,000కు చేరింది. మరోవైపు కొన్ని నివేదికలు అమెరికాలో ఈ పరిస్థితి రావడానికి ట్రంప్ కారణమని చెబుతున్నాయి. ట్రంప్ అధికారుల సూచనలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: