కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీలో తన పరాజయానికి గల కారణాలేంటో తెలుసుకునే పనిలో పడ్డారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ కేరళ లోని వయనాడ్, యూపీ లోని అమేథీ నుండి పోటీ చేసి ఒక్క వయనాడ్ లో మాత్రమే గెలిచారు. 

అమేథీ లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 50 వేలకు పైగా ఓట్లతో ఆధిక్యంతో రాహుల్ గాంధీపై విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్మృతి ఇరానీ పై లక్షకు పైగా ఓట్లతో ఘన విజయం సాధించాడు. ఇప్పుడు అమేథీలో ఓడిపోవడంతో, ఓటమికి గల కారణాలేంటో తెలుసుకునేందుకు ఓ బృందాన్ని అమేథీకి పంపించారు. 

ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం నెహ్రూ-గాంధీ కుటుంబానికి మొదటినుండి కంచుకోటగా ఉండేది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు ఏఐసీసీ కార్యదర్శి జుబెయిర్ ఖాన్, కాంగ్రెస్ రాయ్‌బరేలీ ఇన్‌ఛార్జి కే ఎల్ శర్మలను రాహుల్ అమేథీ పంపించారు. సాధ్యమైనంత త్వరగా నివేదికను సమర్పించాలని వీరిని ఆదేశించారు. ..

కే ఎల్ శర్మ 2009 వరకు అమేథీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. అదే ఏడాది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత చంద్రకాంత్‌ను పార్టీ ఇన్‌ఛార్జిగా నియమించారు. శర్మ ప్రస్తుతం రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విజయం సాధించిన సంగతి తెలిసిందే



మరింత సమాచారం తెలుసుకోండి: