తెలంగాణ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద పోటెత్తింది. కుండపోత వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరదతో అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. నిర్మల్‌ జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షానికి స్వర్ణ, కడెం ప్రాజెక్ట్‌లకు భారీగా వరద వచ్చి చేరింది. స్వర్ణ ప్రాజెక్ట్‌ ఆరు గేట్ల ద్వారా వరద ప్రవాహాన్ని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. స్వర్ణ వాగుకు సమీపంలోని నిర్మల్‌ పట్టణం పూర్తిగా నీట మునిగింది. నగరంలోని సిద్ధాపూర్‌, జీఎన్‌ఆర్ కాలనీలను వరద నీరు ముంచెత్తింది. ఒక్కసారిగా వరద నీరు రావడంతో... కాలనీ వాసులు ఇళ్ల పైకి చేరారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. సుమారు 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో ఏ నిమిషాన ఏం జరుగుతుంతో అని ప్రజలు భయపడుతున్నారు.

జిల్లా కలెక్టర్‌, ఎస్పీ సహా ఉన్నతాధికారులు పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరిలించారు. ఎండీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. భైంసా మండలంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో.. 5 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదుల చేస్తున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకపోవడంతో... భైంసాలోని ఆటోనగర్‌ను వరద నీరు చుట్టుముట్టింది. భైంసాలోని ఆటోనగర్, ఎన్.ఆర్.గార్డెన్స్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. వరద నీటిలో చిక్కుకున్న సుమారు వంద కుటుంబాలను అధికారులు నాటు పడవలతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తున్నారు. అటు వరదల్లో చిక్కుకున్న సుమారు 150 మందిని అగ్నిమాపక సిబ్బందిని గజ ఈతగాళ్లు, పోలీసులు రక్షించారు. వీరందరిని పునరావాస కేంద్రానికి తరలించారు. అటు వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రజలు బయటకు రావద్దొన్ని సూచించారు తెలంగాణ సీఎం కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: