నూతన విద్యావిధానంపై సమగ్ర సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేసిన ఏపీ సర్కార్... తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ గా బోధించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొత్త విద్యా విధానం ప్రకారం పీపీ-1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను మొత్తం 6 రకాలుగా వర్గీకరణ చేయనున్నారు. ఇలా చేసేందుకు అదనంగా మరో 14 వేల పాఠశాలలు అవసరం అవుతాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. కొత్తవర్గీకరణకు తగినట్లుగానే ఉపాధ్యాయులు కూడా ఉండాలని సీఎం జగన్ సూచించారు.  దీని వల్ల టీచర్లకు పని భారం తగ్గుతుందని అధికారులకు వివరించారు.

అదే సమయంలో అర్హతలు ఉన్న అంగన్ వాడీ టీచర్లకు ప్రమోషన్లు అవకాశం కల్పిస్తామన్నారు సీఎం జగన్. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు - నేడు పథకం కోసం 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించారు. ఈ నెల 16న పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యా కానుకను అధికారికంగా అందిస్తామన్నారు. ఆ రోజు నుంచే మనబడి నాడు - నేడు రెండో విడత పనులకు శ్రీకారం చుడతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్న విషయాన్ని జగన్ వివరించారు. బడికి రావాలంటే పిల్లలు ఆసక్తి చూపించాలన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకే మొగ్గు చూపాలన్నారు జగన్.

ఇకపై ప్రతి పాఠశాలలో పీపీ-1, పీపీ-2 కోసం శాటిలైడ్ స్కూల్స్ గా, పీపీ-1, పీపీ-2, 1,2 తరగతులను ఫౌండేషన్ స్కూల్స్ గా, పీపీ-1 నుంచి 5వ తరగతి వరకూ ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ గా, 3 నుంచి 7 లేదా 8వ తరగతి వరకు ప్రీ హైస్కూల్ గా, 3 నుంచి 10వ తరగతి వరకూ హై స్కూల్ గా, 3 నుంచి 12వ తరగతి వరకూ హై స్కూల్ ప్లస్ గా వర్గీకరించినట్లు అధికారులు తెలిపారు. ప్రపంచ స్థాయి పోటీకి తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: