ఓవైపు కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నా ఇండియాలో కరోనా టీకాల ప్రక్రియ జోరందుకోలేదు. ఇప్పటికి కేవలం 50 కోట్ల డోసులు మాత్రమే సరఫరా అయ్యాయి. ఇంకా టీకా అందాల్సిన వాళ్లు కోట్లలో ఉన్నారు. టీకాల కొరతే ఇందుకు కారణం.. ఇప్పుడు ఈ కొరత మరికొంత తీరే అవకాశం కనిపిస్తోంది. భారత్‌కు మరో సొంత టీకా అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటి వరకూ ఇండియాలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇకపై మరో సంస్థ టీకాలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి.


గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన కొవిడ్‌ టీకా జైకోవ్‌-డికు అతి త్వరలోనే అనుమతులు రాబోతున్నాయి. ఈ వారంలోనే ఈ సంస్థకు అనుమతులు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. జైకోవ్‌-డి టీకాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ అతి త్వరలో అత్యవసర వినియోగ అనుమతులు జారీ చేసే అవకాశముందట. ఈ సంస్థ జులై 1న తేదీన అత్యవసర అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. డీఎన్‌ఏ సాంకేతికతతో ఈ జైడస్‌ క్యాడిలా సంస్థ వ్యాక్సీన్‌ ను అభివృద్ధి చేసింది. అయితే.. ఇది మూడు డోసుల టీకా. మొదటి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకు రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు తీసుకున్న 56 రోజులకు మూడో డోసు తీసుకోవాలి.


ఇందులో మరో శుభవార్త ఏంటంటే.. ఈ టీకా 12 ఏళ్ల పైబడిన అందరికీ పని చేస్తుంది.  అనుమతులు వస్తే ఏటా 24కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తుందట. జైకోవ్‌-డి టీకాకు అనుమతులు లభిస్తే ప్రపంచంలోనే ఇది తొలి డీఎన్‌ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్‌ అవుతుందట. ఈ వ్యాక్సీన్‌కు డీసీజీఏ అనుమతులు వస్తే దేశంలో అందుబాటులోకి వచ్చే ఆరో వ్యాక్సీన్ అవుతుంది. ఇప్పటికే  కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ వి టీకాల పంపిణీ అవుతున్నాయి. అమెరికాకు చెందిన మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాల వినియోగానికి కూడా కేంద్రం ఈ మధ్యనే పచ్చజెండా ఊపేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: