నేడు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గురువులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ తొలి ఉపాధ్యాయురాలైన సావిత్రీబాయి ఫూలే గురించి తెలుసుకుందాం. సావిత్రీబాయి ఫూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నైగాన్ గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో 1831, జనవరి 3న జన్మించారు. మొదటి ఫెమినిస్ట్ గా.. మహారాష్ట్రలో సామాజిక సంస్కరణ ఉద్యమ కార్యకర్తగా ఆమె వెలుగొందారు. ఇండియాలో ఫస్ట్ ఫిమేల్ టీచర్ గా పేరు తెచ్చుకున్న ఆమె.. తన తొమ్మిదేళ్ల వయసులోనే 13 ఏళ్ల జ్యోతిబా ఫూలేను మనువాడారు. అతనికి కూడా పుస్తకపఠనం అంటే చాలా ఇష్టం. ఈ దంపతులు ఇద్దరూ కలిసి మొదటిసారిగా భారతదేశంలో గర్ల్స్ స్కూల్ స్థాపించారు.

తమ సంఘం నుంచి బహిష్కరణకు గురైనప్పటికీ ఆమె మాత్రం ఆడ పిల్లలు చదువుకునేందుకు బాటలు వేశారు. తన భర్తతో కలిసి బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించి ఆ తర్వాత అలాంటి 18 పాఠశాలలను స్థాపించి ఆడవారి మన్నలను అందుకున్నారు. మొదటి బాలికల పాఠశాలకు కేవలం 9 మంది విద్యార్థులే వచ్చేవారు. వారికి సావిత్రీబాయి పాఠాలు బోధించేవారు. ఆ బాలికలు చదువు మానేయకుండా ఉండాలని వారికి స్టైఫండ్ పేరిట కొంత నగదు కూడా ఇచ్చేవారు. 18 ఏళ్ళ వయసు లోనే విద్యా ఉద్యమం చేపట్టిన మొదటి ఉపాధ్యాయురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. సమాజంలో ఎదురవుతున్న అవమానాలను సైతం లెక్కచేయకుండా మహిళలతో పాటు బడుగు బలహీనవర్గాల కోసం పోరాటం చేశారు. మహిళా సేవామండల్‌ ను స్థాపించి మహిళలను చైతన్య పరిచారు.

కుల వివక్షతపై పోరాటం చేసిన వారిలో సావిత్రీబాయి దంపతులు ముందు వరసలో ఉంటారు. తాను చదువుకుంటున్న రోజుల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆమె ఆడపిల్లలు చదువుకోవడం ఎంత కష్టమో అర్థం చేసుకున్నారు. అందుకే బాలికలకు విద్యను అందించాలని ఆమె పోరాడారు. ఆమె విద్యావేత్త మాత్రమే కాదు ఒక అద్భుతమైన కవయిత్రి కూడా. జీవితంలో వివక్ష, కుల అఘాయిత్యాలు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఎన్నో పద్యాలు రాశారు.

1890వ కాలంలో ప్లేగు వ్యాధితో నరకయాతన పడుతున్న పిల్లలకు చికిత్స అందించేలా తన వంతు కృషి చేశారు. అంతేకాదు అప్పటి ఆర్థిక సంక్షోభంలో సైతం రెండు వేల మంది చిన్నారులకు ఆహారం పెట్టించి తన గొప్ప మనసు చాటుకున్నారు. అయితే ఎంతోమందిని ప్లేగు వ్యాధి నుంచి కాపాడిన ఆమె ఆఖరికి ఆ వ్యాధి కారణంగానే తుది శ్వాస విడిచారు. మార్చి 10, 1897లో మరణించినప్పుడు ఆమె వయస్సు 66 యేళ్లు. ఆమె భౌతిక కాయానికి దత్తత కొడుకు యశ్వంత్‌ అంతిమ సంస్కారాలు జరిపించారు. అయితే డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటే.. సావిత్రీబాయి ఫూలే పుట్టిన రోజును మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: