ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. భారీ వర్షాలకు పింఛా, అన్నమయ్య రిజర్వాయర్లకు గండిపడి కడప జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ప్రాంతాలను తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. గత నెల 20న వరద ప్రభావిత ప్రాంతాలైన చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో సీఎం ఏరియల్ సర్వే చేశారు.

ఇక ఇప్పటికే సీఎం జగన్ తో సమావేశమైన కేంద్ర బృందం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఆయనకు వివరించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ చర్యలను ప్రశంసించిన బృందం.. వరదల వల్ల కడప జిల్లాకు భారీ నష్టం జరిగిందంది. పంటలు కొట్టుకుపోయాయని.. పశువులు చనిపోయాయని తెలిపిన బృందం.. అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిన చోట అపార నష్టం జరిగిందని తెలిపింది. వరద నష్టంలో 40శాతం రోడ్లు, భవనాలు ధ్వంసం అయ్యాయని.. 32శాతం సాగు, అనుబంధ రంగాల్లో జరిగిందని వివరించింది.

ఇక ఇప్పటికే వరదలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలపై సీఎం జగన్ స్పందించారు. గతంలో నెలల తరబడి వరద బాధితులకు సాయం అందేది కాదనీ.. ఇప్పుడు వారం రోజుల్లో సాయం అందిస్తున్నట్టు చెప్పారు. బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా నష్ట పరిహారం అందించినట్టు చెప్పారు. గతంలో రేషన్, నిత్యావసరాలు ఇస్తే చాలు.. అనుకునే వాళ్లనీ.. హుద్ హుద్ లో 22వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి.. చంద్రబాబు 550కోట్ల రూపాయలు ఇచ్చారని సీఎం జగన్ అన్నారు.

మరోవైపు దక్షిణ అండమాన్ లో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం.. నేడు మరింత బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ 3వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, గాలులు, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక ఈశాన్య రుతుపవనాల కదలికలతో రాగల 24గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మరోవైపు తెలంగాణలో రాగల 2రోజులు పొడి వాతావరణం ఉంటుంది.








మరింత సమాచారం తెలుసుకోండి: