రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారా? వ‌చ్చే రెండు మూడు వారాల్లోనే ఆయ‌న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడితో భేటీ అయి.. త‌న రాజీనామా ప‌త్రాన్ని అందిస్తార‌నే వార్త బీజేపీ వ‌ర్గాల్లో హ‌ల్చ‌ల్ చేస్తోంది. నిజానికి రాష్ట్ర అధ్య‌క్ష పీఠం కోసం.. సోము అనేక క‌ల‌లు క‌న్నారు. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఈ ప‌ద‌వి ఇచ్చిన‌ప్పుడు అలిగారు కూడా. ఆ త‌ర్వాత‌.. ఆర్ ఎస్ ఎస్ సిఫార‌సుల‌తో సోముకు ఈ ప‌ద‌వి ద‌క్కింది. అలాంటి ఇష్ట‌మైన ప‌ద‌విని సోము ఎందుకు ఇప్పుడు వ‌దులుకునేందుకు ఎందుకు సిద్ధ‌మ‌య్యారు? అనేది ప్ర‌శ్న‌.

సోము త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం వెనుక మూడు ప్ర‌ధాన కార‌ణాలు ఉన్నాయ ని అంటున్నారు నాయ‌కులు. ఒక‌టి.. పార్టీలో త‌నకు స‌హ‌క‌రించే నాయ‌కులు క‌నిపించ‌క‌పోవ‌డం ప్ర‌ధానంగా ఆయ‌న‌ను ఇబ్బంది పెడుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై సోము గ‌ట్టిగానే పోరాడుతున్నారు. కానీ, ఒక సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు.. దీనిని వ్య‌తిరేకిస్తున్నారు. దీంతో ఆయ‌న ఎంత పోరాడుతున్నా.. ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. కేవ‌లం .. త‌ను మాత్ర‌మే స్పందిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

అదేస‌మ‌యంలో రాష్ట్ర బీజేపీ వ్య‌వ‌హారాలు చూసే కేంద్ర నాయ‌కుడికి, సోముకు మ‌ధ్య కూడా అంత‌రాలు పెరిగిపోయాయి. లాబీయింగుల‌ను త‌ట్టుకోలేక పోతున్నార‌నే వాద‌న కూడా ఉంది. మ‌రోవైపు.. టీడీపీని టార్గెట్ చేస్తున్నార‌నే వాద‌న సోముపై ఉన్న‌త‌స్థాయిలో పార్టీలో వినిపిస్తోంది. టీడీపీని టార్గెట్ చేయ‌డం ఎందుకు అనే భావ‌న కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. ఇది సోము కు ఇబ్బందిగా మారింది. రెండో స‌మ‌స్య‌.. యువ‌త పార్టీలో యాక్టివ్‌గా లేక పోవ‌డం. పైగా ఒక వ‌ర్గం మీడియా త‌న‌ను టార్గెట్ చేయ‌డం. త‌ను ఇచ్చే ప్ర‌సంగాలు.. చేసే వ్యాఖ్యల‌కు.. ఈ మీడియా ఎక్క‌డా ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం దీనిపై అధిష్టానం కూడా సైలెంట్గా ఉండ‌డం సోమును క‌ల‌వ‌ర‌పెడుతోంది.

మ‌రీముఖ్యంగా మూడో స‌మ‌స్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసి ప‌నిచేయాల్సి ఉంటుంద‌నే సంకేతాలు రావ‌డం. ఇది సుత‌రామూ.. సోముకు ఇష్టం లేదు. జ‌న‌సేన‌తో ఉన్నాం క‌దా.. ఇది చాల‌దా.. అనే భావ‌న ఆయ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు.. టీడీపీతో వేదిక‌ల‌ను పంచుకునేందుకు కూడా ఆయ‌న ఇష్ట‌ప‌డ‌డం లేదు. కానీ, అధిష్టానం నుంచి టీడీపీతో క‌లిసి ప‌నిచేయాల‌ని నిర్ణ‌యం దాదాపు వ‌చ్చేసింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే సోము.. ఇక పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేసి.. ఒక సాధార‌ణ నాయ‌కుడిగా నే ఉండ‌డం మంచిద‌ని భావిస్తున్నార‌ని పార్టీలో చ‌ర్చ సాగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: