త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే.. అసలే కరోనా ముంచుకొస్తుంటే.. ఈ ఎన్నికలేంట్రా బాబూ అనుకునేవాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు.. ఈ విషయంలో ప్రజాభిప్రాయం కనుక్కుంటే.. ఇప్పుడెందుకు ఎన్నికలు అన్నవాళ్లు చాలా మందే ఉన్నారని తెలిసింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై డిజిటల్‌ కమ్యూనిటీ వేదిక లోకల్‌ సర్కిల్స్‌ ఓ సర్వే నిర్వహించిది.


ఈ లోకల్‌ సర్కిల్స్ సర్వేలో ఏం తేలిందంటే.. కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని.. 31శాతం మంది ప్రజలు సూచించారట. అలాగే.. ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే.. రాజకీయ పార్టీలు చేపట్టే ఎన్నికల ర్యాలీపై కరోనా ఆంక్షలు విధించాలని 24శాతం మంది కోరారట. అబ్బే.. ఎన్నికల కారణంగా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువండీ బాబూ అన్నవాళ్లు అతికొద్దిమందేనట.. వాళ్ల సంఖ్య నాలుగు శాతం వరకూ ఉన్నదట. అసలు మెుత్తంగా ఈ సర్వేలో 68శాతం మంది పురుషులు, 32శాతం స్త్రీలు పాల్గొన్నారట.


అయితే ఇదంతా ఎన్నకల షెడ్యూల్‌కు ముందు నిర్వహించిన సర్వే అన్నమాట. ఎన్నికల నిర్వహణ విధివిధానాలపై ప్రజల నుంచి సూచనలు తీసుకునేందుకు లోకల్‌ సర్కిల్స్ సంస్థ ఈ ప్రయత్నం చేసింది. ఈ సంస్థ మొత్తం 309 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 11వేల మంది పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అసలు పార్టీలు ర్యాలీలు నిర్వహించకుండా నిషేధం విధించాలని 41శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారట.


ఓవైపు ఒమిక్రాన్ ఉరుముతోంది.. కేసులు లక్షల్లో వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికలు వాయిదా వేయాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. ఈ మేరకు ఈసీ కూడా రాజకీయ పార్టీలతో చర్చలు జరిపింది. కానీ.. రాజకీయ పార్టీలు మాత్రం ఈ కరోనా ఇప్పట్లో వదిలేదు కాదు కానీ.. ఎన్నికలు పెట్టేయండి అని ముక్తకంఠంతో సలహా ఇచ్చాయి. అందుకే ఎన్నికల నిర్వహణకే ఈసీ మొగ్గు చూపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: