దేశంలో రాజ‌కీయ పార్టీలు ఎలాగైనా అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా  పోటీప‌డి ఇస్తున్న వాగ్దానాలు శృతిమించి పాకాన ప‌డుతున్న నేప‌థ్యంలో వీటికి ఎలా అడ్డుక‌ట్ట వేసే అవ‌కాశం ఉందో వెల్ల‌డించాలంటూ సుప్రీం కోర్టు కేంద్రానికి మంగ‌ళ‌వారం నోటీసులు జారీ చేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌హా ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న స‌మ‌యంలో రాజకీయ పార్టీలు ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్టేందుకు అల‌విమాలిన వాగ్దానాలు చేస్తున్నాయంటూ దాఖ‌లైన ప్ర‌జాప్ర‌యోజ‌న వాజ్యంపై విచార‌ణ చేసిన అత్యున్న‌త న్యాయ‌స్థానం ఈ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఇలా ప్ర‌జ‌ల‌ను ఉచితాల‌తో ప్ర‌భావితం చేసి మోస‌గించే పార్టీల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఆ పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ నేప‌థ్యంలో ఉచిత వాగ్దానాల అమ‌లుక‌య్యే మొత్తం వార్షిక బ‌డ్జెట్‌ల కంటే చాలా అధికంగా ఉంటోంద‌ని, ఇది చాలా తీవ్ర స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించింద‌ని, దీనిని నియంత్రించేందుకు చ‌ట్ట‌ప్ర‌కారం ఏం చేయాలో న్యాయ‌స్థానం తెలుసుకోవాల‌నుకుంటోంద‌ని సుప్రీం ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లోగా వీటికి సంబంధించి చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం సాధ్య‌మ‌వుతుందా..? అని ప్ర‌శ్నించ‌డంతోపాటు, ఈ అంశంపై రాజ‌కీయ పార్టీల‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించాలంటూ గ‌తంలో న్యాయ‌స్థానం.. ఎన్నిక‌ల సంఘానికి సూచ‌న‌లు చేసిన విష‌యాన్ని కూడా ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. అయితే ఈసీ ఇప్ప‌టిదాకా ఆ దిశ‌గా స‌మ‌ర్థ‌మైన చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని కూడా న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు.

 ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌త్యేకించి పంజాబ్‌లో ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పార్టీల‌న్నీ పోటీప‌డి వాగ్దానాలు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. వాటికి ఎంత వ్య‌య‌మ‌వుతుంద‌న్న‌ది అంచ‌నాలకు అంద‌ని ప‌రిస్థితి ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా నేత‌లు వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. సంప్ర‌దాయ పార్టీల‌తోపాటు ఆమ్ఆద్మీ పార్టీ కూడా ఈ విష‌యంలో ముందుడ‌టం విస్తుగొలిపే అంశం. నిజానికి దేశ‌వ్యాప్తంగా ఇదే దుస్థితి నెల‌కొని ఉంద‌న్న‌ది వాస్త‌వం. ఉచిత ప‌థ‌కాల కార‌ణంగా కొన్నిరాష్ట్రాల్లో ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు అత‌లాకుత‌ల‌మ‌వుతున్నాయి. ప్రత్య‌ర్థి పార్టీ చేసిన వాగ్దానాల‌ను మించి తాము ఉచిత ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించ‌క‌పోతే ఎక్క‌డ వెనుక‌బ‌డిపోతామోన‌నే అనివార్య ప‌రిస్థితుల్లోకి రాజ‌కీయ‌పార్టీలు చేరుకున్నాయి. దీంతో అభివృద్దిపై దృష్టి పెట్ట‌కుండా అనుత్పాద‌క ప‌థ‌కాల‌కే ఓటు వేసే చెడు సంప్రదాయాల‌కు తెర లేచింది. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో సుప్రీం నోటీసుల‌కు కేంద్రం ఏవిధంగా స్పందిస్తున్న‌ది రాజ‌కీయ పార్టీల్లోనే కాక సామాన్య ప్ర‌జల్లోను ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: