ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని.. మిగతా రాష్ట్రాలు తెలంగాణను చూసి ఆశ్చర్యపోతున్నాయని సీఎం కేసీఆర్ జనగామలో అన్నారు. ఏడేళ్ల క్రితం ఎక్కడున్నాం..ఇప్పుడెక్కడున్నామనేది ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ సంపద కల్గిన రాష్ట్రమని.. కరవు ముచ్చటే ఉండదని చెప్పారు. సదుపాయాలు బాగున్నందునే అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని.. భవిష్యత్తులో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామన్నారు.

జనగామ యశ్వంతపూర్ లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ఒకప్పుడు కరువు సీమగా ఉండే జనగామలో ఇవాళ ఎన్నడూ పండని పంటలు ఇప్పుడు పండుతున్నాయన్నారు. జనగామలో మంచినీళ్ల బాధ.. కరెంట్ బాధ పోయిందన్నారు. నీళ్ల బాధలు కూడా త్వరలోనే పోతాయన్నారు. గోదావరి నీళ్లు జనగామకు తీసుకొస్తామన్నారు. నాడు జనగామ ప్రజల వెతలు చూసి జయశంకర్, తాను ఏడ్చినట్టు చెప్పారు. ఈ రోజు అద్భుతమైన పరిపాలన భవనాలను జనగామలో ప్రారంభించుకున్నట్టు సీఎం కేసీఆర్ అన్నారు.

అంతేకాదు బీజేపీ ఉడుత బెదిరింపులకు టీఆర్ఎస్ భయపడదని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేశారు. తమ శక్తి ముందు బీజేపీ అడ్రస్ లేకుండా పోతుందని జనగామ సభలో అన్నారు. రాష్ట్రంలో అడ్రస్ కూడా లేని బీజేపీ తమ కార్యకర్తలపై కొన్ని చోట్ల దాడులు చేస్తోందని.. తమతో పెట్టుకుంటే నాశనం అవుతారని హెచ్చరించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో మోటార్లు పెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. తమ ప్రాణం పోయినా.. మీటర్లు పెట్టనివ్వనని తెగేసి చెప్పారు.

తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని జనగామ సభలో సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. 8ఏళ్లు కేంద్రం సహకారం లేకుండానే ఎదిగామన్నారు. కాజేపీట రైల్వే ఫ్యాక్టరీ, రైల్వే జోన్, రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదాను ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కేంద్రం సమస్యలను సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని.. తెలంగాణ పులి బిడ్డగా అవసరమైతే ఢిల్లీ కోటను బద్దలు కొట్టేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.





మరింత సమాచారం తెలుసుకోండి: