తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ పై కీలక ప్రకటన చేశారు. మొత్తం 91,142 ఉద్యోగాలకు గాను 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆటో గరిష్ట వయో పరిమితిని కూడా పెంచుతున్నట్టు సభలో కేసీఆర్ ప్రకటించారు. ఈ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే దక్కుతాయని,ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని సీఎం వివరించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే ఇప్పుడు ఉద్యోగాల ప్రకటన చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ ఎంపీ            వి.హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు.

ఇన్నాళ్లు నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇప్పటివరకు ఎందుకు ఉద్యోగాలను భర్తీ చేయలేదని ప్రశ్నించారు. అప్పులు చేసి తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించుకున్నారు. కానీ ఉద్యోగాలు లేక ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రొఫెసర్ కోదండరాం కేసీఆర్ కొలువుల జాతర పై భిన్నంగా స్పందించారు. సీఎం ప్రకటన సంతృప్తికరంగా లేదన్న కోదండరాం అందుకు కారణాలను వివరించారు. తెలంగాణలో వివిధ శాఖల్లో అంతా కలిపి ప్రస్తుతం 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటే కెసిఆర్ మాత్రం కేవలం 80 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడాన్ని కోదండరాం తప్పుబట్టారు. ఇక జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి లాంటి కాంగ్రెస్ నేతలు కెసిఆర్ పై విమర్శలు చేశారు.

కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం కెసిఆర్ ప్రకటన మీద హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పోరాటం చేసిందన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వలేదని అనేకసార్లు వివర్శించామని అన్నారు. ఇక సీఎం కేసీఆర్ కు జగ్గారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో సోనియా, రాహుల్ గాంధీ పాత్ర కీలకమని చెప్పారు. సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ అడుగుతానని అన్నారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ ను రీ ఓపెనింగ్ చేయాలని కోరుతా అని జగ్గారెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: