అవటానికి తెలుగుదేశంపార్టీకి చాలా బలమైన జిల్లాయే అయినా అదంతా గతచరిత్రగా మిగిలిపోయిందా ? తాజాగా జరిగిన పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మంగళవారం ఉదయం కృష్ణాజిల్లా నేతల సమావేశం జరిగింది. సమావేశం మొదలైన కొద్దిసేపటికే పార్టీ నేతల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాంతో మాజీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, నాగూల్ మీరా సమావేశంలో నుండి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు.






ఎందుకు గొడవైందంటే సమావేశం సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో బుద్ధా ఫొటో లేదట. ఇదే విషయమై బుద్ధాకు సమావేశం ఏర్పాటుచేసిన వారికి మధ్య పెద్ద గొడవే జరిగిందని సమాచారం. ఇక్కడ విషయం ఏమిటంటే విజయవాడ నేతల్లో బుద్ధా, మీరా, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ ఒక టీము. వీళ్ళకు ఎంపీ కేశినేని నానీతో ఏమాత్రం పడదు. అలాగే మాజీమంత్రి దేవినేని ఉమకు ఎంపీకి మధ్య సంబంధాలు ఉప్పునిప్పు. అలాగే మాజీమంత్రికి ముగ్గురు నేతలకు కూడా ఏమాత్రం పడదు.





ఈ మూడు నాలుగు గ్రూపుల్లోని నేతల్లో ఒకరు అవునంటే మిగిలిన గ్రూపుల్లోని నేతలు కాదంటారు. ఒకళ్ళని మరొకళ్ళు వ్యతిరేకించుకుని గొడవలు పడటంవల్లే విజయవాడ కార్పొరేషన్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయినా సరే ప్రతిచిన్న విషయానికి గొడవలు పడుతునే ఉంటారు. వీళ్ళమధ్య సయోధ్యచేద్దామని చంద్రబాబునాయుడు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాక చివరకు వదిలేశారు.





తాజా వివాదంపై బుద్ధా మాట్లాడుతు ఫ్లెక్సీలో తన ఫొటో లేకపోవటంలో తనకేమీ కోపం లేదన్నారు. కాకపోతే జిల్లాలో పార్టీ పరిస్ధితి చూస్తుంటేనే తనకు ఏడుపొస్తోందని చెప్పారు. ఇక్కడ ఎవరిమాట ఎవరు వినరని, అందరం కలిసికట్టుగా పనిచేయాలన్న బుద్ధి కూడా లేదన్నారు. అందరినీ కూర్చోబెట్టి చంద్రబాబు క్లాసుపీకినా ఎవరికీ బుద్ధిరావటంలేదన్నారు. సో నేతల వ్యవహారం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లోకూడా ఇలాగే గొడవలు పడుతుంటారన్న విషయం అర్ధమైపోయింది.  మనం గెలవకపోయినా పర్వాలేదు పక్కవాడు గెలవకూడదన్న మనస్తత్వం బాగా పెరిగిపోయినట్లుంది తమ్ముళ్ళల్లో. ఈ గొడవల కారణంగానే వచ్చే ఎన్నకల్లో కృష్ణాజిల్లాలో ఎదురుదెబ్బలు తప్పేట్లు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: