మీడియా అంటే ప్రభుత్వంలో జరుగుతున్న తప్పొప్పులను ఎత్తిచూపటమే. తప్పును తప్పుగాను, ఒప్పును ఒప్పుగాను చూపించటమే అసలైన మీడియా చేయాల్సింది. కానీ ప్రభుత్వం చేసే ప్రతిపనిలోను లోపాలను మాత్రమే ఎత్తిచూపుతు, ఒప్పులను కూడా తప్పులుగా జనాలకు చూపించే ప్రయత్నం చేస్తున్న మీడియాను ఏమనాలి ? ఇలాంటి మీడియాకు కొందరు పాలకులు ఎల్లోమీడియా అని నామకరణం చేశారు. ఇదంతా ఇపుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలనపై ఎల్లోమీడియా వ్యవహరిస్తున్న విధానం విమర్శలపాలవుతోంది కాబట్టే.






ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖలోని రుషికొండపై ప్రభుత్వం నిర్మాణాలను చేస్తున్న విషయం తెలిసిందే. కొండమీద తవ్వకాలు జరిగిన ప్రాంతంపై ప్రభుత్వం కొత్తగా గ్రీన్ మ్యాట్ ను ఏర్పాటుచేసింది. ఈ విషయమై ఎల్లోమీడియా తనదైన పద్దతిలో రెచ్చిపోయింది. ఇంతకీ ఈ మ్యాట్ ఎందుకు ఏర్పాటుచేసిందంటే చూసేవాళ్ళకు అంతా పచ్చగా ఉండేలా కనబడటం కోసం ప్రభుత్వం అవస్ధలు పడుతోందని ఎల్లోమీడియా చెప్పింది. అలాగే మార్చిలో జరుగుతున్న అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు హాజరయ్యే అంతర్జాతీయ ప్రతినిధుల కళ్ళ బడకుండా అని తనదైన భాష్యం చెప్పేసింది.





రుషికొండను తవ్వేసి నిర్మాణాలు చేస్తున్న విషయం స్ధానికులందరికీ తెలిసిందే. కాబట్టి దాన్ని ప్రభుత్వం కొత్తగా  దాచిపెట్టాల్సిన అవసరంలేదు. అయితే ప్రభుత్వం కొత్తగా గ్రీన్ మ్యాట్ ను ఎందుకు ఏర్పాటుచేసినట్లు ? ఎందుకంటే పైనుండి రాళ్ళు జారికింద పడకుండా గ్రీన్ మ్యాట్ అడ్డుకుంటుందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే తవ్వకాలు జరిగిన ప్రాంతంలో గాలికి దుమ్మపైకి లేచి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్ళమీద పడకుండా ఉంటుందనే గ్రీన్ మ్యాట్ ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వం చెప్పింది. 





ఇళ్ళమధ్యలో నిర్మాణాలు జరుగుతున్నపుడు సదరు ఓనర్లు ఇంటిచుట్టూ కవర్లను కప్పుంచటం అందరికీ తెలిసిందే. దీని ఉద్దేశ్యం కూడా దుమ్మ చుట్టుపక్కలున్న ఇళ్ళమీద పడకుండా ఉండటమే. వాస్తవం ఇలాగుండగా చేస్తున్న విధ్వంసం జనాల కళ్ళబడకుండా ఉండటం కోసమే ప్రభుత్వం గ్రీన్ మ్యాట్ కప్పిందని చెప్పటమే విచిత్రంగా ఉంది. అభివృద్ధీ కావాలి, పర్యావరణానికి ఇబ్బంది జరగకూడదంటే కష్టమే. కాకపోతే ఏ స్ధాయిలో పర్యావరణం డిస్ట్రబ్ అవుతుందని ప్రభుత్వం ముందుగానే లెక్కలేసుకోవాలి. మొత్తానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రీన్ మ్యాట్ ను కూడా ఎల్లోమీడియా తప్పుడు దృష్టిలో చూడటమే విచిత్రంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: