లిక్కర్ మాయాజాలంలో అక్రమాల వ్యవహారం మరుగున పడింది. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఏసీబీ కేసులు నీరుగారిపోయాయనే అనుమానాలకు బలం చేకూరుతోంది. మద్యం సిండికేట్లు, ఎమ్మార్పీ ఉల్లంఘనలు, ముడుపులు, బినామీల పేర్లతో వ్యాపార లైసెన్సులు, మంత్రులకే మామూళ్లను అందజేస్తున్న వైనాన్ని వెలుగులోకి తెచ్చి ఒక్కసారిగా పెను సంచలనం సృష్టిచింన లిక్కర్ కేసుల వ్యవహారం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఏసీబీలో సమర్ద అధికారులుగా పేరున్న సిట్ అధినేత శ్రీనివాసరెడ్డి బదలీ, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ భూబతిబాబుపై మరో అధికారిని నియమించడంతో ఒక్కసారిగా లిక్కర్ సిండికేట్ల వ్యవహారం మరుగున పడింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మంత్రులు, ఐఏఎస్ లు, జగన్ అరెస్టులతో అందరూ ఈ విషయాన్ని మరచిపోయారు. 2011 డిసెంబర్ 13న ఏసీబీ అధికారులు కరీంనగర్ లో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల నుంచి రూ.మూడున్నర లక్షలపైగా అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారంలో సదరు ఎక్సైజ్ సీఐ ఇచ్చిన సమచారం ఆధారంగా ఇది మద్యం సిండికేట్ల నుంచి స్వీకరిస్తున్న మమూళ్ల వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. స్టేట్ టాస్క్ ఫోర్స్ కు చెందిన అధికారులు ఈ మొత్తాన్ని లంచంగా తీసుకున్నారని సీఐ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా క్రైం నెం.15 కింద వివిధ కేసులు నమోదు చేశారు. అనంతరం ఏసీబీ జరిపిన దాడుల్లో తీగలాగితే డొంక కదిలినట్లుగా రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో వేళ్లూనుకున్న సిండికేట్ల తీరు, అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగిస్తూ అందుకు సహకరిస్తున్న ఎక్సైజ్, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, రాజకీయ నేతలు, మంత్రుల తీరు వెలుగులోకి వచ్చింది. ఈ రకమైన వసూళ్లు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని గుర్తించిన ఏసీబీ అధికారులకు దాడుల్లో విభ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ర్టవ్యాప్తంగా ఈ సిండికేట్ల మాయాజాలంలో బడానేతల ప్రమేయం ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది. రాష్ర్టంలోని 6596 మద్యం షాపుల్లో అధికంగా సిండికేట్లే దుకాణాలను నిర్వహిస్తున్నారని తేల్చిన ఏసీబీ 350 సిండికేట్లపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో అనుమానితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లు, పత్రాలను స్వాధీనం చేసుకొని పలువురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన మద్యం వ్యాపారి నున్నా వెంటకరమణ, అప్పటి ఎక్సైజ్ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు రెండు షాపుల మద్య వివాదం పరిష్కరించినందుకు రూ.10లక్షలు ముడుపులు అందజేసినట్లు ఇచ్చిన వాంగ్మూలం సంచలనం సష్టించింది. దీనిపై దర్యాప్తు జరుపుతున్న అధికారులకు కీలక సమాచారం లభించింది. మద్యం సిండికేట్ల నుంచి తీసుకున్న మామూళ్లను బడానేతలు, ఎక్సైజ్ అధికారులు అదే వ్యాపారంలో బినామీలుగా పెట్టుబడులు పెట్టగా, మరి కొందరు వడ్డీలకు కోట్ల రూపాయలను ఇచ్చినట్లుగా గుర్తించింది. ఇదిలా ఉండగా శ్రాకాకుళం, విజయనగరం జిల్లాల్లో పీసీసీ చీఫ్ బొత్సకు చెందిన సిండికేట్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా సంచలనం రేకెత్తింది. ఈ ముడుపుల వ్యవహారంలో ఒక మాజీ కలెక్టర్, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్, సుమారు 40 మంది ఎక్సైజ్ అధికారులు 30 మందికి పైగా సిండికేట్ వ్యాపారులను అరెస్టు చేశారు. ఈ మొత్తం ఉదంతంలో ఏసీబీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి దర్యాప్తును చేపట్టింది. దీనికి అధిపతిగా ఐజీ శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. ఈ దర్యాప్తు తీవ్రంగా సాగుతున్న కీలక తరుణంతోపాటు మరో వారంలో ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న సమయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దూకుడుగా వ్యవహరించిన ఏసీబీ తెల్లరేషన్ కార్డుదారుల పేరుతో బినామీ లైసెన్సు లు పొంది వారికి తెలియకుండానే మద్యం వ్యాపారం చేస్తున్నారని గుర్తించింది. అందుకు పౌపసరఫరాల శాఖకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఏపీబీసీఎల్ గోదాములపై దాడులు జరిపి బినామీల జాబితాను సేకరించి వారికి మద్యం సరఫరా నిలిపివేయాలని ఏసీబీ ఆదేశించింది. దీంతో వ్యాపారులు ఇరుకున పడ్డారు. ఏసీబీ దర్యాప్తు, దాడులతో రాష్ర్ట ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ నేపథ్యంలో సిట్ అధిపతి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం కీలక తరుణంలో బదలీ చేస్తూ అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏసీబీకి ప్రభుత్వానకి మధ్య పెద్ద హైడ్రామా నడిచింది. దీనిపై కినుకు వహించిన ఏసీబీ జేడీ భూబతిబాబు శ్రీనివాస్ రెడ్డిని రిలీవ్ చేయకపోవడంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. అంతేకాకుండా రాజకీయ నాయకుల మూకుమ్మడి ఒత్తిడితో భూబతిబాబుపై ఆర్టీసీలో మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ప్రసాదరావును ఏసీబీ చీఫ్ గా ప్రభుత్వం నియమించింది. దీంతో ఈ కేసు పురోగతి ఒక్కసారిగా మందగించి పోయింది. షరామామూలే అన్నట్లు మద్యం వ్యాపారులు ఆడిందే ఆట..పాడిందే పాట అన్నట్లు మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: