
తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన తొలి విప్లవ కారుడు దొడ్డి కొమురయ్య మరణంతో మొదలైన ప్రజా ఉద్యమం మరింత పదునెక్కింది. ఊరూరా ప్రజలు ఉప్పెనలా కదిలారు. దొరలకు, నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మట్టి మనుషులు కొడువళ్లనే కత్తులగా చేసి, గుత్పలనే బడిశెలుగా చేసుకుని నిజాం రాజ్యాన్ని నేలమట్టం చేశారు. దాస్య శృంఖలాల విముక్తి కోసం అలుపెరుగని యుధ్ధం చేశారు.దొడ్డి కొమురయ్య మరణవార్త జనగామ మహాసభ కార్యకర్తలందరిలో విషాదం నింపింది. దేశ్‌ముఖ్‌లను, నిజాం దాష్టికాలను, దుర్మార్గాలను ఎదుర్కోవడానికి పాలకుర్తి ప్రాంతం నుంచి 56 వేలమంది వివిధ గ్రామాల ప్రజలు కర్రలు, బరిసెలు, ఆయుధాలతో కదిలివచ్చారు. చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో ఓ మహోజ్వల జ్వాల. విసునూర్ దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా పోరాడింది. ఐలమ్మ ఇల్లు ఆంధ్రమహాసభ కార్యకలాపాలకు కేంద్రమైంది. పాలకుర్తి కుట్ర కేసులో ఆరుట్ల రామచంద్రా రెడ్డితోపాటు ఆమో భర్త, ఇద్దరు కొడుకులు జైలు పాలయ్యారు. చాకలి ఐలమ్మ సంఘంలో చేరి విసునూర్ దొరకు వ్యతిరేకంగా పనిచేసింది. మల్లంపల్లి మఖ్తెదారు ఐలమ్మను భూమినుంచి గెంటేసినా భూమిని వదలనని ఐలమ్మ పట్టుబట్టింది. వరిధాన్యం మూటలు గట్టుకొని అందరూ భుజాన వేసుకుని ఐలమ్మ ఇంటికి చేరుస్తుండగా దారిలో దొర గూండాలు ఎదురైనా, వందలాది మంది కార్యకర్తలను చూసి పారిపోయారు. పోలీసులతో రాత్రి ధాన్యాన్ని దోచుకోవడానికి ప్రయత్నించాడు. దీనిని గమనించిన కమ్యూనిస్టులు ధాన్యాన్ని విసునూర్ దొరల పాలు కాకుండా కాపాడారు. అలాగే, మరో వంక దేవరుప్పులలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మందడి సోమిరెడ్డి అమరుడయ్యాడు. ఇంతలో మిలటరీ పోలీసులు ఆగకుండా రెండు వేల మందిపై కాల్పులు జరపడంతో కామారెడ్డి గూడెం దళ నాయకుడు గోలి పాపిరెడ్డి వీర మరణం పొందాడు. దీంతో జనం ఎక్కడికక్కడ చెదిరిపోయారు. దేవరుప్పులలోని 350 మందితో పాటు కడవెండి కామారెడ్డి గూడెంకు చెందిన మరో 40 మంది కమ్యూనిస్టులను పట్టుకొని పోయారు.
ప్రజలు నిజాం మిలటరీ దాడులకు వ్యతిరేకంగా పదివేల మందితో పెద్ద బహిరంగసభను ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. నిజాం సైన్యం వాసాలమర్రి తమ్మడపల్లి-పల్లే పహాడ్, దందుకూరు, మీనవోలు, మేడిపల్లి, సిరిపురం, ఆల్లీపురం, సీతారాంపురం, తరిగొప్పుల, నెల్లికుదురు తదితర గ్రామాలపై విచక్షణారహితంగా దాడులు జరిపి ప్రజల మాన ప్రాణాలను దోచుకున్నారు. లెక్కకు మించి గ్రామాలకు నిప్పటించారు. 45 మందిని చంపారు. దీనికి ప్రతీకారంగా 75 మంది పోలీసులు, రజాకార్లు ప్రజా గెరిల్లాల చేతిలో హతమయ్యారు. తెలంగాణ విప్లవోద్యమాన్ని అణచి వేయడానికి విధ్వంసానికి పూనుకున్నారు నాటి దేశ్‌ముఖ్‌లు నిజాం ప్రభువు. 1948 మార్చి 2న రేణిగుంటపై 400 మంది మిలటరీ రజాకార్లు అత్యాధునిక ఆయుధాలతో దాడి చేశారు. విప్లవాలకు రేణిగుంట కంచుకోట లాంటిది. దళ నాయకుడు రేణిగుంట రామిరెడ్డితో పాటు 30 మంది దళ సభ్యులున్నారు. వారి వద్ద 15 సాధారణ తుపాకులే ఉన్నప్పటికీ వేలాది మంది మిలటరీని ఎదురించారు. ఉదయం 5 గంటలకు మొదలైతే సాయంత్రం ఆరు గంటల వరకు భీకరమైన యుద్ధం జరిగింది. 42 మంది శత్రువులు చనిపోయారు. తుదిశ్వాస విడిచేంత వరకు పోరాడుతూ రేణిగుంట రామిడ్డితో పాటు 30 మంది నేలరాలి అరుణ తారలయ్యారు. ఒక వ్యక్తి మాత్రం గాయాలతో బతికి బయటపడ్డాడు.
ఆ తర్వాత బైరాన్‌పల్లిపై దాడి జరిపింది నిజాం సైన్యం. మొదటిరోజు గ్రామ రక్షక దళం వారిని తరిమికొట్టారు. రెండో రోజు అదనపు బలగాలతో వచ్చింది సైన్యం. రెండోసారి విప్లవకారులకు పరాజయం తప్పలేదు. మూడోరోజు 200 మంది రజాకార్లు ఆధునిక ఆయుధాలతో గ్రామంపై దాడికి తెగబడ్డారు. గెరిల్లా దళం, గ్రామ రక్షక దళం, గ్రామ ప్రజలంతా కలిసి శత్రువులను తరిమికొట్టారు. ఈ దాడిలో ఐదుగురు రజాకార్లు చనిపోయారు. బైరాన్‌పల్లి యుద్ధభూమిగా మారింది. రజాకార్లు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. మహిళలను బట్టలిప్పించి బతుకమ్మ ఆడించారు. 86 మందిని పట్టుకొని వరుసగా నిలబెట్టి అతి దారుణంగా కాల్చి చంపారు. ఆకునూర్‌లో ముష్కరుల దాడి మానవత్వం లేని చర్యగా చరిత్ర కెక్కింది. చివరిదాడిలో 31 మంది గ్రామస్థులను పట్టుకొని తల్వార్లతో క్రూరంగా తలలు నరికి చంపారు.
1947 సెప్టెంబర్ 11న రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్‌లు నిజాం గద్దెను కూల్చడానికి సాయుధ పోరాటం ఒక్కటే మార్గమని చారిత్రాత్మక ప్రకటన చేశారు. ప్రభుత్వానికి పన్నులు కట్టొద్దు. వాడవాడ జాతీయ పతాకాలు ఎగురవేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలు బహిష్కరించాలి. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలు బహిష్కరించాలి. భూస్వాముల చేతిలో బందీగా ఉన్న భూములను స్వాధీనం చేసుకొని భూమి లేని పేదలకు పంచాలి’ అని పిలుపునిచ్చారు. విద్యార్థులు యువతీ యువకులు దళాలుగా ఏర్పడి గ్రామల్లో తిరుగుతూ జాతీయజెండా, చేత బట్టుకొని ఎర్ర జెండాలను ఆవిష్కరించారు. యువతే తెలంగాణ ప్రజానీకానికి విప్లవ సందేశం అందించింది. నిజాం ప్రభుత్వం కూలేదాకా, ప్రజల ప్రభుత్వం ఏర్పడే వరకు వారంతా వీర సైనికులుగా పనిచేశారు. హిందూ మహాసభ మతోన్మాద సంస్థలకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రజాసైన్యాన్ని నిర్మించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, కట్కూరి సుశీల, దూడల సాలమ్మ, నామాల లక్ష్మమ్మ, తునికి ముత్తమ్మ, చాకలి ఐలమ్మ వంటి వీరవనితలు ఎందరో ప్రజల కోసం ప్రాణాలర్పించారు.
నిజాం సంస్థానం తెలంగాణ 11 జిల్లాలతో పాటు కర్నాటకలో 3 జిల్లాలు, మహారాష్ట్రలో 5 జిల్లాలతో కలిపి నిజాం సంస్థానం ఉండేది. ఈ ప్రాంతాల్లో ప్రజలు నిజాంకు కట్టు బానిసలు, వారు ఏది చెప్తే అదే శాసనం. ప్రజలు కేవలం దొరలకు, దేశ్‌ముఖ్‌లకు వెట్టిచాకిరి చేయడానికి మాత్రమే ఉన్నారన్నట్లుగా వ్యవహరించే వారు. నిజాం పాలనపట్ల కడుపుమండిన ప్రజలు పోరుబాట పట్టారు. తెలంగాణలో పదకొండు జిల్లాలు. మహారాష్ర్టలో 5 జిల్లాలు, కర్నాటక ప్రాంతంలో 3 జిల్లాలు కలసి హైదరాబాద్ సంస్థానం ఉండేది. ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో 90 లక్షల జనాభా ఉండేది. హైదరాబాద్ సంస్థానంపై నైజాం రాచరిక ప్రభుత్వ పాలనవుంది. జాగీరుదారుల నిరంకుశ పరిపాలనలో ప్రజానీకం అనేక బాధలు పడ్డారు. వెట్టిచాకిరికి గురయ్యారు. చంటిపిల్లల తల్లులు, బాలింతలను కూడా దొరలు, జాగీరుదారులు వ్యవసాయ పనులకు భయపెట్టి తీసుకుపోయేవారు. బాలింతలను మధ్యాహ్నం తమ బిడ్డలకు పాలు యిచ్చేందుకు వెళ్ళనిచ్చేవారు కారు. రైతులు వేసుకున్న పంటలను పట్ట పగలే తమ కిరాయి గుండాలతో కోయించి తమ గడీలను నింపుకునే వారు. పట్టా భూములను దొరలకప్పగించేవారు. ప్రభుత్వ భూములు, పోరంబోకు భూములన్నీ దొరల, భూస్వాముల చేతిలో అధీనంలో వుండేవి. విసునూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి ఆరుగాలం రైతులు పండించి పంటలను స్వాధీనం చేసుకునేవాడు. దొరలకు వెట్టి పనులు చేయడానికి నిరాకరిస్తే మూటాముల్లే సర్దుకుని గ్రామాన్ని వదిలి వెళ్ళాల్సిందే. వ్యాపారం చేసే వాళ్లు అధికారులకు కావాల్సివున్న సన్న బియ్యం, నెయ్యి, నూనె, పప్పు, చింతపండు, బీడీలు, సిగరెట్లు, చుట్టలు సబ్బులు, మాలు మసాలా తదితర వస్తు సామగ్రినిని ఉచితంగా సరఫరా చేయాలి. అవి సకాలంలో అధికారులకు అందకుంటే అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సిందే.
ప్రజానీకాన్ని అనేక విధాలుగా దోపిడి చేసి ప్రజాకంటకులయ్యారు. దొరలు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు కుబేరులయ్యారు. దొర బజారులో వెళుతుంటే దొరకు ఎదురయ్యే ప్రజలంతా కాళ్ళకు చెప్పులుంటే వాటిని విడిచి వంగి వంగి దండాలు పెట్టాలి. అరుగులపై కూర్చున్న వారంతా లేచి నిలబడి నమస్కరించాలి. గ్రామాలకు ప్రభుత్వ అధికారులు వస్తే వంతుల ప్రకారం గొర్లమందల నుంచి గొర్లను, మేకలను తెప్పించి కోసి అధికారులకు విందులు చేసేవారు. ఈ అధికారులకు ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్న ప్రయోజనం లేకుండా పోయింది. వెట్టిచాకిరి చెయ్యటానికి పుట్టినామని మాబ్రతుకులు మారయని నిస్పృహతో కుమిలి కుమిలి పోయేవారు ప్రజలు. దొరలు చెప్పిన పాడుపనులన్నీ కడుపులు మాడ్చుకుని చేసినప్పటికీ అధికారులు, దొరలు ఆగ్రహావేశాలకు తన్నులు, తిట్లు తినాల్సి వచ్చిన రోజులవి. ఎన్ని పనులు చేసినా నోరు మెదపకుండా ఉండాల్సిన బానిసత్వ రోజులవి. హైదరాబాద్ సంస్థానంలో జిల్లా కేంద్రంలో హై స్కూలు మాత్రం ఉండేది. మిడిల్ స్కూలు కూడా లేని తాలూకా కేంద్రాలెన్నో.. ప్రాథమిక పాఠశాలలు పెట్టుకొవాలన్నా, గ్రంథాలయాల స్థాపనకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. ఇలా తెలంగాణ ప్రాంతంలో ప్రజలు దోపిడి అణచివేతలు అన్యాయాలకు వెట్టిచాకిరికి గురై బానిసత్వపు బతుకులతో చదువు సంధ్యలు లేని చీకటి రోజులవి.
ఈ క్రమంలో సురవరం ప్రతాప రెడ్డి అధ్యక్షతన మెదక్ జిల్లా జోగిపేటలో 1930లో ఆంధ్రమహాసభ జరిగింది. ఆ మహాసభలో పలు తీర్మానాలు చేసారు. ఆ మహాసభ వేదిక నుంచి ఆయా తీర్మానాలను రావి నారాయణరెడ్డి చదివారు. మహాసభలో పాల్గొన్న యువకులు, సంఘసంస్కర్తలను అవి ఆకర్షించాయి. వారిలో ఉత్తేజాన్ని నింపాయి. ఈ తీర్మానాలను ప్రభుత్వానికి పంపించారు. ఎక్కడికక్కడ మహాసభ ప్రచారకులను నియమించారు. నల్గొండ జిల్లా చండూరును కేంద్రంగా చేసుకుని వెట్టి చాకిరి విధానానికి, వంతుల విధానానికి వ్యతిరేకంగా జనాన్ని సమీకరించి ఉద్యమ నిర్మాణానికి నడుం బిగించారు. ప్రభుత్వధికారులు గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజల చేత నిర్బంధంగా పనులు చేయించుకోకూడదని, పనికి తగ్గ ప్రతిఫలమిచ్చి వారితో పనులు చేయించు కోవాలని ప్రభుత్వం ఆదేశాలు వెలువరించింది. ఉద్యమకారులు ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూ, నిజాం దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజానీకాన్ని కదిలించి ప్రజా పోరాటాల్లోకి దించేవారు. దీంతో దొరలు ఆంధ్రమహా సభ ఉన్న ప్రదేశాలలో వెట్టిచాకిరి పనులు చేయించుకోవడం మానుకున్నారు.
అప్పట్లో జనగామ తాలుకా నల్గొండ జిల్లాలో ఉండేది. 50 గ్రామాలలో విసునూర్ దేశ్‌ముఖ్‌ల పరిపాలన సాగుతుంది. విసునూర్ దొరల దోపిడి కింద నలిగిపోతున్న ప్రజానీకమంతా ఆంధ్ర మహాసభలో స్వచ్ఛందంగా చేరారు. కడివెండి సీతారాంపురం గ్రామాల్లో గ్రామ రాజ్య కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. కడివెండిలో భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కమ్యూనిస్టులు గ్రామాలలో పోరాటం ఉదృతం చేయడంతో భూస్వామ్య దొరల గుండెల్లో వణుకు పుట్టింది. విసునూర్ దేశ్‌ముఖులు కడివెండిలో స్వాధీన పర్చుకున్న 250 ఎకరాల భూమిని ఒకే రోజు పది గ్రామాల ప్రజలు పశువులు, గొర్రెలు, మేకలతో మేపుకున్నారు. సంఘటిత బలాన్ని చూపించారు. పాలకుర్తి కుట్ర కేసులో 12 మందిని అరెస్ట్ చేశారు.