హైదరాబాద్: దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పాలక మండలి గడువు మరి కొద్ది రోజుల్లో ముగియనున్నది. టీటీడీ ఛైర్మన్ గిరీ కోసం ప్రస్తుత ఛైర్మన్ కనుమూరి బాపిరాజు తోపాటు మరో ఇద్దరు ఎంపీలు టి.సుబ్బిరాంరెడ్డి, రాయపాటి సాంబశివరావు, ఆదికేశవులు నాయుడు తదితరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు ఒక్కసారంటే ఒక్కసారి అవకాశం కల్పించాల్సిందిగా వారందరూ ఢిల్లీస్థాయిలో ముమ్మరంగా పైరవీలు చేసుకుంటున్నట్లు సమాచారం. తాను ఏడాది పాటే ఛైర్మన్ చేశాననీ, మరోమారు అవకాశం కల్పించాల్సిందిగా ప్రస్తుత ఛైర్మన్ బాపిరాజు కోరుతుండగా, పార్టీ ఆదేశించడంతో నెల్లూరు పార్లమెంటు ఉప ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాననీ, కనీసం టీటీడీ ఛైర్మన్ ఇస్తే దేవుని సేవలో పరితపిస్తాననీ సుబ్బిరాంరెడ్డి ఢిల్లీ పెద్దల్ని కోరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇక గుంటూరు ఎంపీ సాంబశివరావు కూడా ఎన్నో సంవత్సరాలుగా వెంకన్న సన్నిధిలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నాలు బాగానే చేస్తున్నప్పటికీ ఆయనకు మాత్రం వెంకన్న సేవ అవకాశం రావడం లేదు. మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఎప్పుడూ సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకే దక్కుతోంది. అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారెవరూ టీడీపీ ఛైర్మన్ పదవీకి అర్హులు కాదా? కేవలం సభ్యులుగా మాత్రమే అర్హులా? ఎప్పుడూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారినే ఛైర్మన్ చేయడంలో మతలబు ఏమిటి? అనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. దశాబ్దాల తరబడిగా టీటీడీ ఛైర్మన్‌ను తెలంగాణేతురులే వెలగబెడుతున్నారు.
ఒకటో రెండు డైరెక్టర్లు తప్ప తెలంగాణకు ఛైర్మన్ గిరీని కట్టబెట్టకపోవడం పట్ల తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు టీటీడీ ఛైర్మన్‌కు పనికిరారా? అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. టీటీడీ పాలక మండలిని ఏర్పాటు చేయడంలో మొదటి నుంచీ తెలంగాణకు అన్యాయమే జరుగుతోంది. తెలంగాణకు ఇచ్చిన డైరెక్టర్ పదవులకు కూడా తిరుమలలో సంబంధిత అధికారులు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ సభ్యులు గగ్గొలు పెట్టిన సందర్భాలు లేకపోలేదు. ఛైర్మన్లుగా ఎప్పుడూ వ్యాపారవేత్తలను, పార్టీకి ఫండ్ ఇచ్చే వారిని నియమిస్తున్నారనే అపవాదు కూడా లేకపోలేదు. ఆర్థికంగా ఉన్నవారిని, ఢిల్లీలోని టెన్ జన్ పథ్ లో పలుకుబడి ఉన్నవారిని ఛైర్మన్‌గా నియమించడం పట్ల భక్తులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారవేత్తలను ఛైర్మన్‌గా నియమించడం వల్ల సదరు ఛైర్మన్లు డబ్బున్న వారిపట్ల ఓ విధంగా, సాధారణ భక్తుల పట్ల మరో విధంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికైనా ఢిల్లీలోని టెన్ జన్ పథ్ వాళ్లు టీటీడీ ఛైర్మన్‌గా దేవుడి పట్ల గౌరవం, నమ్మకం ఉండి, భక్తి శ్రద్ధలను కలిగిన అతి సాధారణమైన వ్యక్తిని నియమిస్తే బాగుంటుందనేది భక్తుల కోరిక. అదే విధంగా ఈ మారు చైర్మన్‌గా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని నియమించాలనీ పలువురు కోరుతున్నారు. అయితే, ఢిల్లీ పెద్దలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి