హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి బలమైన మన రాష్ర్టం కూడా ‘చే’జారిపోతుందా? అనే భయం కాంగ్రెస్ అధిష్టానాన్ని వెంటాడుతోంది. అత్యధిక ఎంపీలను ఇచ్చి కేంద్రంలో రెండుపర్యాయాలు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన ఎపీ రాజకీయాలు అధిష్టానాన్ని భయపెడుతున్నాయి. రాష్ర్ట వ్యవహారాలు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఓ వైపు తెలం‘గానం’, మరోవైపు జగన్, ఇంకోవైపు మంత్రుల మెడకు కేసుల వ్యవహారం. ఇలా రాష్ర్ట కాంగ్రెస్ను, ప్రభుత్వాన్ని వరుస సమస్యలు చుట్టుముట్టాయి. సాధారణ ఎన్నికలకు కేవలం 20నెలల టైం మాత్రమే వుంది. పార్టీ పరిస్థితి చూద్దామా అంటే కడు దయనీయంగా మారింది. ఎవరికి వారే యమునా తీరు అన్న చందంగా రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది.  దక్షణ భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో పటిష్టంగా ఉన్నదని భావిస్తున్న మన రాష్ర్టంలోనూ కాంగ్రెస్ పార్టీ అధ్వాన్నంగా మారుతుండటం కేంద్ర నాయకత్వానికి కొంత ఇబ్బందిగా మారింది. దివంగత రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం అన్నీ తానై చూసుకునే వాడు. పెద్దగా ఢిల్లీ పెద్దలు రాష్ర్టం విషయంలో కలుగచేసుకునే వారు. కానీ, ఆయన చనిపోయాక రాష్ర్ట రాజకీయ రూపురేఖలే మారాయి. వైఎస్ కుమారుడు జగన్ పార్టీ వీడటం, తెలంగాణ అంశం ఉధ్రుతం కావడం, అనేక కేసుల్లో మంత్రులు ఇరుక్కోవడం వల్ల కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చింది. తాజాగా నాల్గో క్రిష్నుడి కోసం అన్వేషిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. రాష్ర్ట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డజను మంది మంత్రుల వరకు అనేక కేసులతో కొట్టుమిట్టాడుతున్నారు. మోపిదేవి వెంకట రమణ జైలులో ఊచలు లెఖ్కిస్తున్నారు. అదే దారిలో మరి కొంత మంది ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు ఏ క్షణమైనా మంత్రి పదవీకి గుడ్ బై చెప్పే పరిస్థితి. అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ర్ట కాంగ్రెస్ను బతికించుకోవడం కోసం, పూర్వ వైభవం కోసం అధిష్టానం కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రాష్ర్ట ‘చే’జారిపోకుండా ఏం చేస్తే బాగుంటుందనే దానిపై ద్రుష్టిని మళ్లించినట్లు సమాచారం. ఈ బాధ్యతలను అధిష్టానం కేంద్ర మంత్రి వాయిలార్ రవికి అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు అందుబాటులో ఉన్న రాష్ర్ట నాయకులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టంలో కాంగ్రెస్ను తిరిగి గాడిలో పెట్టాలంటే ఏం చేస్తే బాగుంటుందనే దానిపై నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. స్వాతంత్ర్య వేడుకలు ముగిసిన తరువాత రవి పూర్తిగా రాష్ర్టం మీద ద్రుష్టి పెట్టే అవకాశాలున్నాయి. జగన్ ను ఎలా నిలువరించాలి, తెలంగాణ అంశాన్ని ఎలా తేల్చాలి, కేసుల్లో ఇరుక్కున మంత్రుల పరిస్థితి ఏంటి, ఏం చేస్తే రాష్ర్టంలో కాంగ్రెస్ మరింత బలపడుతుంది తదితర అంశాలపై రవి రాష్ర్ట నాయకులతో మాట్లాడే అవకాశం వుంది. అందరి అభిప్రాయాలను తీసుకున్న తరువాత అధిష్టానం ట్రీట్ మెంటును మొదలుపెట్టవచ్చని ప్రచారం సాగుతోంది. మొత్తానికి రాష్ర్టంలో జరుగుతున్న వ్యవహారాలు కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పలేనన్ని ఇబ్బందులను తెచ్చి పెడుతున్నట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ బలమైన రాష్ర్టం. ఈ రాష్ర్టంలోనే కాంగ్రెస్ కుక్కలు చింపిన విస్తరిలా తయారయితే వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఏంటి అనేది పట్టిపీడిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఖాతా నుంచి రాష్ర్టాన్ని ‘చే’జారిపోకుండ ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానం అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: