ఆగస్టు పదిహేను ద్రోహాన్ని చెప్పక పోతే అన్నం సహించదు నాకు అన్నటువంటి విప్లవ కవి చెరబండరాజు ఆనాటి ఆవేదన నిజమేననే అనుమానాలు కలుగుతున్నాయి . 65 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని పరిశీలిస్తే అది మిగిల్చింది ‘పాలకులకు ఏ.సి – పాలితులకు గోచీ” మాత్రమేనని లోతుగా పరిశీలిస్తే స్పష్టమవుతుంది. స్వాతంత్ర్యం రాక ముందు మన దేశ సంపదను కేవలం బ్రిటిష్ సామ్రాజ్యవాదులే కొల్లగొట్టేవారు. స్వాతంత్ర్యం వచ్చి అధికార మార్పిడి జరిగిన తర్వాత భారతదేశంలో వివిధ సామాజ్యవాదదేశాల దోపిడికి తలుపులు తెరుచుకున్నాయి. ఆగస్టు పదిహేను సంబరాలకు, స్వాతంత్ర్యానికి కారకులమని చెప్పుకునే గాంధీతో పాటు మరికొంత మంది నాయకులకు పాలక వర్గం జేజేలు పలుకడంలో వింతేమి లేదుగాని తమకు గోచీ మాత్రమే మిగిల్చిన నిజాన్ని నిరుపేదలు గమనించాల్సి ఉంది. స్వాతంత్ర్యం మా జన్మహక్కుగా జాతి సంపదను మెక్కేవారు ఎంతో మంది ఉన్నారు. ఒక దశలో స్వాతంత్ర్యం వారి కోసం వచ్చిందా అనే అనుమానాలు కలుగక మానవు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 65 సంవత్సరాలు పూర్తి చేసుకొని 66వ సంవత్సరంలోకి అడుగిడుతున్న తరుణంలో ప్రతి సంవత్సరం వాడవాడల జెండాకు వందనం చేయడం, జాతీయ పతాకాను ఎగురవేయడం జరుగుతుంది. చాలా మంది ప్రజాప్రతినిధులు ఖద్దరు బట్టలు దరించి తాము గాంధీ గారి వారసులమని చెబుతుండడం పరిపాటిగా మారింది. కాగా వారసులమని చెప్పడంలో ఆంతర్యం తెలియడం లేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికి దేశం పేదరికంలో ఉంది. దేశ సంపద కొందరి చేతుల్లోనే ఉండడంతో ఎండేవారిది ఎండుతుంది- నిండేవారిది నిండుతుంది ఫలితంగా స్వాతంత్ర్యం ఫలాలు అందరికి అందకుండా పోతున్నాయి. భారత దేశం బాగ్యసీమగా పేరుపొందిందని, సకల సంపదలకు కొదువలేదని, బంగారు పంటల భూములున్నాయని, జీవనదులున్నాయని చెబుతుండగా ఇవన్ని ఉన్నప్పుడు దారిద్ర్యం ఎలా ఉందో పాలకులకే తెలియాల్సి ఉంది. సర్వమత సమానత, అందరికి కూడు,గూడు, నిరుద్యోగ సమస్యనిర్మూలనతో పాటు కులమతాలకు అతీతంగా అందరు సమానంగా జీవించినపుడే స్వాతంత్ర్యానికి నిజమైన అర్థమని చెప్పవచ్చు...

మరింత సమాచారం తెలుసుకోండి: