మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలపై సీరియస్‌గా ఫోకస్‌ చేసింది బీజేపీ అధిష్టానం. ఎలాగైనా రెండు రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే మరాఠా గడ్డపై శివసేనతో కలిసి అధికారంలోకి రావాలని స్కెచ్‌ వేస్తున్నారు. మరోవైపు హర్యానాలోనూ విజయం సాధించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి కీలక అంశాలపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించారు. 


మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల క్రమంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాతో పాటు ఇతర కేంద్రమంత్రులు కూడా పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే పొత్తులపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కీలకమైన మహారాష్ట్రలో శివసేనతో పొత్తుపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. 


మరోవైపు ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల గురించి మోడీ వద్ద నడ్డా ప్రస్తావించినట్టు తెలిసింది. నామినేషన్లకు సమయం అసన్నమవడంతో ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని నడ్డా ప్రతిపాదించారు. దీనికి సానుకూలంగా స్పందించిన మోడీ, అమిత్‌ షా త్వరలోనే అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలుపుతున్నట్టు సమాచారం.ఇక తెలంగాణలోని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. స్థానిక బీజేపీ నేత డా.కోట రామారావును తమ అభ్యర్థిగా బరిలో నిలుపుతున్నట్లు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు. అలాగే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగనున్న 32 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు.


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ—శివసేన మధ్య సీట్ల పంపకానికి సంబంధించిన చర్చలు ఓ వైపు కొనసాగుతుండగా, మరోవైపు శివసేన తమ పార్టీ అభ్యర్థులకు 'ఏబీ' ఫాంలు పంపిణీ చేసింది. అధికార పార్టీ అభ్యర్థిగా నిర్ధారించే దరఖాస్తులనే ఏబీ ఫాంలు అంటారు. 2014 ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులకు ఆయా స్థానాల్లో తిరిగి పోటీకి వీలుగా శివసేన ఈ ఏబీ ఫాంలు అందించింది. మరోవైపు మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి ఇప్పటికే సీట్ల సర్దుబాటు ప్రకటించింది. ఇరు పార్టీలు చేరి 125 స్థానాల్లో బరిలోకి దిగుతామని వెల్లడించాయి. మిగిలిన స్థానాల్లో కూటమిలోని ఇతర చిన్న పార్టీలు పోటీ చేయనున్నాయి. అక్టోబర్‌ 21న ఒకే విడతలో హర్యానాలో 90, మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు దేశంలోని పలు రాష్ర్టాల్లో ఖాళీ అయిన 64 శాసనసభ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు అక్టోబర్‌ 21నే జరగనున్నాయి. 24వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: