హైదరాబాద్: వైఎస్ కుటుంబానికి అండగా ఉంటూ వస్తోన్న వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ దంపతులు వైఎస్ఆర్ సీపీపై అలిగారా? అంటే తాజా పరిణామాలు ఔననే సమాధానమిస్తున్నాయి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంటు కోసం రాజధానిలో రెండ్రోజులు పాటు వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షలో కొండా దంపతులు కనిపించలేదు. తెలంగాణలో చేపట్టిన విజయమ్మ ఫీజు దీక్షకు కొండా దంపతులు గైర్హాజర్ కావడం పార్టీలో కలకలం రేపుతోంది. పార్టీని వీడుతారనే వార్తలు గుప్పుమంటున్నాయి. పార్టీలోని ఒకరిద్దరు నేతల తీరుతో కొండా దంపతులు తీవ్ర అసంత్రుప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.  వైఎస్ కుటుంబం కోసం అన్ని విధాలుగా నష్టపోయినప్పటికీ, పార్టీలో తమకు దక్కాల్సినంత ప్రాధాన్యత దక్కకపోవడమే కాకుండా, తమ పట్ల పార్టీలోని ఒకరిద్దరు నాయకులు చలాయిస్తున్న పెత్తనంతో కొండా దంపతులు పూర్తిగా విసిగి వేసారి పోయారనీ జోరుగా ప్రచారం జరుగుతోంది. వరంగల్ జిల్లాలో కొండ దంపతులకు మంచి పట్టు వుంది. నిరంతరం ప్రజలు, కార్యకర్తల మధ్యన ఉండే కొండా దంపతులు వైఎస్ఆర్ సీపీకి దూరమవుతున్నారనీ జరుగుతున్న ప్రచారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కొండా సురేఖ మంత్రి పదవీకి రాజీనామా చేశారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటులో వైఎస్ పేరు చేర్చడంతో చివరకు ఎమ్మెల్యే పదవీని కూడా సురేఖ వదులుకున్నారు.  వైఎస్ కుటుంబానికి అండగా నిలిచినందుకు ఆమె భర్త కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవీని కాపాడుకోవడానికి న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. వైఎస్ కుటుంబానికి అండగా ఉంటున్నందుకు ఓ వైపు పదవులు పోగొట్టుకుని, మరో వైపు ఆర్థికంగా నష్టాన్ని చవిచూసినప్పటికీ ...పార్టీ నేతలు తమ పట్ల అనుసరిస్తున్న తీరుతో కలత చెందారనీ తెలుస్తోంది. పార్టీలో వైఎస్ బంధువులైన ఒకరిద్దరు నేతలు అవలంభిస్తున్న తీరుకు చాలా మంది నేతలు పార్టీకి దూరమవుతున్నట్లు తెలుస్తోంది. ఒంటెద్దు పోకడలకు పోవడం వల్లనే కొండా దంపతులతో పాటు అనేక మంది నేతలు రాజధానిలో చేసిన విజయమ్మ రెండ్రోజుల దీక్షకు గైర్హజరైనట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ గడ్డపై చేపట్టిన విజయమ్మ దీక్షకు సంబంధించి తెలంగాణలో పట్టున్న కొండా దంపతుల వంటి నేతలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడంతోనే చాలా మంది నేతలు దీక్షకు హాజరు కాలేకపోయారనీ పార్టీలో కొంత చర్చ జరుగుతోంది. ఒకరిద్దరు నేతలు చేస్తున్న పెత్తనం వల్ల అనేక మంది నేతలు అసంత్రుప్తితో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వైఎస్ కుటుంబం కోసం ఎన్నో విధాలుగా నష్టపోయిన కొండా దంపతులకే పార్టీలో దక్కాల్సిన ప్రాధాన్యత దక్కకపోతే...మిగతా నాయకుల పరిస్థితి గురించి వేరే చెప్పనక్కర్లేదనీ అసంత్రుప్తుల వాదన. ఇదిలా ఉంటే, ఎప్పుడూ మీడియాలో పార్టీ వాయిస్ను వినిపించేటు వంటి అంబటి రాంబాబు, రోజా వంటి నేతలు కూడా విజయమ్మ ఫీజు దీక్షలో కనిపించకపోవడంపై అనేక అనుమానాలు, ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలోని నేతలు అనుసరిస్తున్న ధోరణి నచ్చక ఇప్పటికే వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి దంపతులు తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వైఎస్ఆర్ సీపీ తన తప్పులను సరిదిద్దుకోకుంటే భవిష్యత్ లో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడం తథ్యమనీ పార్టీకి చెందిన ఓ నాయకుడు ఈ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. కొండా దంపతులు పార్టీకి దూరమైతే, తెలంగాణ వైఎస్ఆర్ సీపీ బాగానే నష్టాన్ని చవిచూడాలసి వస్తోందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: