పురపోరు కోసం కామారెడ్డి జిల్లాలో దూకుడు పెంచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంగా.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ పావులు కదుపుతున్నారు. దీంతో జిల్లాలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.

 

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ హీట్‌ తారాస్థాయికి చేరింది. కామారెడ్డితో పాటు కొత్తగా ఏర్పాడిన బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు. ఇప్పటికే కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు షబ్బీర్‌ అలీ, జీవన్‌ రెడ్డిలు వారిని యాక్టివేట్‌ చేస్తున్నారు.

 

అధికార టీఆర్‌ఎస్ పోలీసులతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు షబ్బీర్‌ అలీ. ప్రస్తుతం అధికారం టీఆర్‌ఎస్ చేతుల్లో ఉన్నా.. త్వరలో అది చేతులు మారుతోందని, ఆ విషయం పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు.  ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలను చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు షబ్బీర్‌ అలీ.

 

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, మాజీ ఎమ్మెల్యే రవీందర్‌ రెడ్డి మధ్య గ్రూపు తగదాలతో ఒకరికొకరు సహకరించుకోవడం లేదు. ఇది కాస్తా టీఆర్‌ఎస్‌కు మైనస్ అయ్యే అవకాశముంటుందంటున్నారు స్థానికులు. దీంతో నేతల మధ్య సయోధ్య కుదిర్చి ఎలాగైనా ఎల్లారెడ్డి మున్సిపాలిటీని దక్కించుకోవాలనుకుంటుంది గులాబీ దళం. ఆ గ్రూపు తగాదాలు తగ్గేవి కాదని.. వాటితోనే అధికారంలోకి వస్తామంటోంది కాంగ్రెస్.

 

ఇక పార్లమెంటు ఎన్నికల్లో.. ఓటమి పాలైన కాంగ్రెస్‌కు పరువు దక్కిందంటే దానికి బాన్సువాడ పట్టణమే కారణం. దీంతో ఆ మున్సిపాలిటీని ఎలాగైనా దక్కించుకోవాలని పావులు కదుపుతోంది కాంగ్రెస్. మరోవైపు బాన్సువాడలో స్పీకర్‌ పోచారంకు మంచి పట్టు ఉండడంతో.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ వార్‌ నడుస్తున్నా.. కాంగ్రెస్‌ది కొంచెం పై చేయిగానే ఉంది.


మరోవైపు.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో చేతులెత్తేసింది బీజేపీ. అక్కడ పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడు. మొత్తం మీద.. బీజేపీ పోటీలో లేకపోవడంతో ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే కొనసాగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: